31, అక్టోబర్ 2015, శనివారం

భావకవివర్య! దేవులపల్లి వంశ్య !


"మనతెలుగు - తెలుగుతల్లి"

"మనతెలుగు - తెలుగుతల్లి"
(గేయం)
పల్లవి. తేట తేట మాటలకు - ఆటపట్టు మన తెలుగు
తీయని జాతీయాల - తేనెపట్టు మన తెలుగు || తేట తేట ||
చ. 1. మల్లె విరితావి వోలె - ఉల్ల మలరించు తెలుగు
మలయమారుతము వోలె - పులకింత గూర్చు తెలుగు || తేట తేట ||
2. ఆపాత మధురంబై - హర్ష మొందించు తెలుగు
ఆలోచనామృతమై - ఆనంద మందించు తెలుగు || తేటతేట ||
3. మృణాళ నాళము పగిది - మృదులంబైనది తెలుగు
తేనెసోనల పురుడించు - తియ్యందనాల తెలుగు || తేటతేట ||
4. అవధానకళ కెంతో- అద్దము పట్టిన తెలుగు
కర్ణపర్వ పద్యమును - కన్నతల్లి మనతెలుగు || తేటతేట ||
5. అతిథుల నభ్యాగతుల - నాదరించు జాతి తెలుగు
మహిత పూర్వ సంస్కృతిని - మన్నించు జాతి తెలుగు || తేటతేట ||
6. సకలకళల కాణాచి - జన కరుణా వారాశి
కామితార్థ కల్పవల్లి - ప్రేమరాశి తెలుగుతల్లి || తేటతేట ||
7. నన్నయ తిక్కనాది కవుల - కన్నతల్లి తెలుగుతల్లి
అన్నమయ్య త్యాగయ్యల - కన్నతల్లి తెలుగుతల్లి || తేట తేట ||
8. రుద్రమ్మ చానమ్మల - భద్రమాత తెలుగుతల్లి
రాయల ప్రతాపరుద్రుల - లాలించిన తెలుగుతల్లి || తేటతేట ||
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

పద్య సారస్వత పరిషత్తు ఆవిర్భావం

30న విరించి వానప్రస్థాశ్రమంలో ఆవిర్భావ సభ 
మనదైన తెలుగు పద్యాన్ని పరిరక్షించుకోవడం, భాషాభివృద్ధి కోసం తెలుగు రాష్ట్రాల (ఆంద్ర – తెలంగాణా) పరిధిగా రాజమండ్రి వేదికగా నూతనంగా ‘పద్య సారస్వత సమితి’ ఏర్పాటైంది. ఇరు రాష్ట్రాల ప్రతినిధులతో కార్యవర్గం కూడా రూపుదిద్దికుంది. అలాగే ఓ మాస పత్రిక కూడా నడపాలని నిర్ణయించారు. బహుశా ‘పద్య భారతి’ పేరు ఖరారు అయ్యే అవకాశాలున్నాయి. ఇక లాంచనంగా సంస్థ ఆవిర్భావ సభ అక్టోబర్ 30వ తేదీ ఉదయం 10గంటలకు రాజమండ్రి శ్రీరామ నగర్ శ్రీ విరించి వానప్రస్థాశ్రమంలో సభ నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా పద్య సారస్వత సమితి ప్రధాన కార్యదర్శి శ్రీ సిబివి ఆర్ కె శర్మ గురువారం ఉదయం ఆయన నివాసంలో మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. మాస పత్రిక సంపాదక వర్గం డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు , శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్, సాగి శ్రీరామ చంద్ర మూర్తిలతో కల్సి నిర్వహించిన సమావేశంలో శ్రీ శర్మ మాట్లాడుతూ ఇప్పటికే జనభావన, త్రివేణి సమ్మేళనం , ఆంద్ర పద్య కవితా సదస్సు , నన్నయ సారస్వత పీఠం సంస్థల ద్వారా పద్య పరిరక్షణ కోసం చేస్తున్న కృషిని ఆయన ప్రస్తావిస్తూ , పద్యం పట్ల చులకన భావం పోగొట్టడానికి తమ వంతు ప్రయత్నం చేస్తున్నామని వివరించారు. 
ఎంతచేసినా ఎన్ని చేసినా పర్యాయ పదాలు లేని ఇంగ్లీసు భాషా ప్రభావం అధికంగా వుండడం వలన గ్రామీణ వ్యవస్థ నుంచి తెలుగు భాషను , పద్య ప్రాధాన్యం నిలబెట్టడానికి తెలుగు రాష్ట్రాల ప్రతినిధులు కల్సి , పద్య సారస్వత సమితి ఏర్పాటు చేసినట్లు శ్రీ శర్మ చెప్పారు. శుక్రవారం ఉదయం 10గంటలకు జరిగే సభలో గాయకులూ , హెడ్ కానిస్టేబుల్ శ్రీ సత్యనారాయణ లలిత సంగీత లహరితో కార్యక్రమం ప్రారంభమవుతుందని చెప్పారు. పద్య సారస్వత సమితి అధ్యక్షులు శ్రీ చదలవాడ లక్ష్మీ నరసింహారావు అధ్యక్షత వహిస్తారు. ఆదిత్య విద్యా సంస్థల సంచాలకులు శ్రీ ఎస్పీ గంగిరెడ్డి సభా ప్రారంభం చేస్తారు. 10.58గంటలకు సంస్థ శీర్షిక ను బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు , ఎం ఎల్ సి శ్రీ సోము వీర్రాజు ఆవిష్కరిస్తారు. సంస్థ చిహ్నాన్ని నగర మేయర్ శ్రీమతి పంతం రజనీ శేషసాయి ఆవిష్కరిస్తారు. ప్రతిజ్ఞను ప్రముఖ మానసిక వైద్య నిపుణులు డాక్టర్ కర్రి రామారెడ్డి నిర్వహిస్తారు . శ్రీ చల్లా సాంబి రెడ్డి (హైదరాబాద్ పావని సేవా సమితి) విశిష్ట అతిధిగా పాల్గొంటారు.
డాక్టర్ ఎస్వీ రాఘవేంద్రరావు మాట్లాడుతూ పద్యమైనా , గద్యమైనా ఆదరించాలన్నారు. రస స్పర్స గల ఒక వ్యాఖ్య మైనా సరే కావ్యమే నని అయన విశ్లేషించారు. ఈ సందర్భంగా పద్యం చదివి వినిపించి , ఆహ్లాద పరిచారు. శ్రీ పెరుమాళ్ళ రఘునాధ్ మాట్లాడుతూ ఓ మంచి ప్రయత్నంతో ఆవిర్భవిస్తున్న పద్య సారస్వత సమితి ఆశయం నెరవేరాలని ఆకాంక్షించారు.

29, అక్టోబర్ 2015, గురువారం

అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు

అంతర్వేది "శ్రీలక్ష్మీనృసింహస్వామి"వారి
ఆలయనిర్మాత శ్రీ కొపనాతి కృష్ణమ్మవర్మగారు
"నరజన్మం బిల దుర్లభంబు, బహుజన్మప్రాప్త
పుణ్యంబు, త
న్నర జన్మం బిల సార్థకం బగు జగన్నాథున్
ప్రకీర్తింపగన్,
మరి దేవాలయ మంటపాదుల వినిర్మాణంబు
సామాన్యమే ?
ధరణిన్ "కృష్ణమ" జన్మ సార్థకమె "యంతర్వేది
నిర్మాతగాన్."
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

27, అక్టోబర్ 2015, మంగళవారం

" ప్రజారాజధాని"

" ప్రజారాజధాని"
రాజధాని యిదే 'మన రాజధాని'
ఇందు 'మన మట్టి' 'మన నీరు' పొందుపరచి
రనుచు భావితరాలకు వినుచు ఘనత
కలుగు మనకు నాత్మీయతాగరిమ తోడ.
రైతు రాజయ్యె పొలమిచ్చి రక్తితోడ
రాజధాని వినిర్మాణ రమ్య హర్మ్య
రచన కొరకు 'నిటుక' లీయ రండు! రండు!
ఇంటి కొక పూవు, మాలగు నీశ్వరునకు
పాలుగొను డమరావతి భవ్యనగర
నిర్మితిన్ "బాబు" పిలుపున నిష్ఠతోడ.
ఆంధ్రవైభవ ప్రాభవ సాంద్ర కీర్తి
శాతవాహనాదిక వంశ చక్రవర్తు
లేలిన "యమరావతి" యమరేంద్ర రాజ
ధాని నే డాంధ్రులకు రాజధాని యయ్యె,
ధాన్యకటకంబు నా నాటి ధరణికోట,
యిది "ప్రజా రాజధాని" వర్ధిల్లుగాక!
తెలుగు కీర్తి పతాకయై వెలుగుగాక!
"ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
డాక్టర్ యస్వీ.రాఘవేంద్రరావు.

10, అక్టోబర్ 2015, శనివారం

అభినందన



                                          అభినందన
 
              "అరుదౌ జ్ఞాపకశక్తి, సర్వవిషయైకాసక్తి, ధీయుక్తి, యే
              బిరుదుల్ బొందని పాండితీగరిమయున్ పెంపారు మీ సొమ్ములై,
              సరసుల్ మెచ్చెడు న్యాయవాదివర! గఛ్ఛత్ గ్రంథభాండారమా!
              వెరపేలేని విలేకరీ! పఠితవై వేవేల గ్రంథాలకున్
              చిరకీర్తిన్ గడియించుకొంటిరి ధరన్ శ్రీసూర్యనారాయణా!"
    "విశ్వనాథ, మల్లంపల్లి, విదిత సుకవి అల్ల ఆంధ్రపురాణకర్తాది సాహి
    తీ విరాణ్మూర్తుల యనుబంధిత సదస్సు గౌతమీతీర "సాహిత్య గౌతమి" తన
    "షష్టిపూర్తి" సంబరములు జరుపుకొనదె? తనవ్యవస్థాపకునితోడ ఘనత మీర
    "పోతుకూచి" వంశాంబుధి పూర్ణచంద్ర! సూర్యనారాయణా! నమస్సుమ శతంబు!
    ఆయురారోగ్యభాగ్యమ్ములందుడయ్య!అందుకొనుడయ్య!మాయభినందనములు!"
                                                భవదీయుడు,
                      
                                "ఆంధ్రశ్రీ", "పద్యకవి తిలక", "సరసకవి",
                                   డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు.

1, అక్టోబర్ 2015, గురువారం

"స్వఛ్ఛభారత్"

"స్వఛ్ఛభారత్"
"తొలుదొల్తన్ పనిచేసి చూపవలె నెంతో శ్రధ్ధగా,
పిమ్మటన్
పలుకంగావలె" నంచు జెప్పెనుగదా "బాపూజి",
నీ కార్యముల్
సలుపంబూనుట "స్వఛ్ఛభారత" మగున్
సంకోచ రాహిత్యతన్,
తెలిపెన్ దాని "నరేంద్రమోడి" ప్రజకున్ దేశంపు
క్షేమంబుకై.
ప్రతివారున్ స్వగృహంబులన్, పరిసర
ప్రాంతంబులన్, స్వఛ్ఛశు
భ్రతలన్ పాలనజేయ "భారతము" తా
"స్వఛ్ఛంబగున్" పూర్తిగా,
సతతంబుందురు భోగభాగ్యములతో
స్వాస్థ్యంబు శోభిల్లగన్,
అతిపూజ్యంబగు భారతంబు ధరలో
నాధ్యాత్మికస్వఛ్ఛతన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

మహాత్మా గాంధీ జయంతి సందర్భముగా



సత్యాహింసల నాయుధద్వయముగా శాంతంబు త్రాణంబుగా
అత్యాశాపరతన్ విశాల భరతజ్యాపాలనాసక్తులౌ
అత్యుగ్రారుల యుక్కడంచితివి పూజ్యా ! దాస్య నిర్మూలకా !
"జాత్యారాధిత ! గాంధితాత !" కొనుమా శ్రద్ధాత్మ భక్త్యంజలిన్.
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

28, సెప్టెంబర్ 2015, సోమవారం

ప్రజాకవి జాషువా

"కవికోకిల" జాషువా జయంతి సందర్భంగా
           ప్రజాకవి జాషువా
తే. "వాణి నారాణి" యనె కవివరు డొకండు,
    "నను వరించెను శారద" యంటి వీవు,
    "దమ్ముగల కవిపుంగవుల్" సుమ్ము మీరు
    అందుకొనుడయ్య! మాదు జోహార్లు శతము.

తే. అయిదు తలల నాగేంద్రున కడలిపోయి
    దాని బుసలకు వసివాడు ధరణి గావ
    "గబ్బిలము రచియించితి వబ్బురముగ
    ప్రజల నాల్కల తిరముగ బ్రతుకు సుకవి!

సీ. "గిజిగాని గూ"డను గిలిగిలి తూ గుటు
         య్యాల గృహపుఠీవి నరసితెట్లు?
    "నెమిలి నెలత" కట్టిన మలిన వస్త్రంబు
          నామె పాతివ్రత్య మరసితెట్లు?
    ఆడు మగతనంబు లమరిన సాలీని
           జిలుగు నేతల నేర్పు తెలిసె నెట్లు?
    "బుజ్జాయి" దర్జాలు బొటవ్రేలి చొక్కును
            "శిశువు" వర్ణన నీదు వశమదెట్లు?

తే. అల్ల జాబిలిని "చెవుల పిల్లి", గొల్ల
    భామ" యొయ్యార "మింద్రచాపంపుసొగసు,
    "శిల్పి" సల్పు సృష్టిరహస్య శిల్పజాల
    మింత నిశితంబుగా ప్రకృత్యంతరంగ
    శోధనము చేయు ఘనకవీశు డెవ డిలను?
    జాషువా! నీవుగాక! "విశ్వకవి" వీవు!

తే. "పచ్చిబాలెంతరాలని భరతమాత
    బొగడి "గడనకెక్కిన యాంధ్రపుత్త్రవర్య!
    "పద్మభూషణా!" జాషువా! ప్రథితకీర్తీ!
    అందుకోవయ్య! జన్మదినాంజలులను!
   "ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"

     డాక్టర్. సంగాడి వీరరాఘవేంద్రరావు

26, సెప్టెంబర్ 2015, శనివారం

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

జీవనాధార పుణ్యగోదావరీ న
దీ మతల్లిక యొడిలోన తృప్తి తీర
అమృత తుల్య సుస్వాదు పయస్సు లాని
రాణకెక్కితివి మహాంధ్రి రాణ్మహేంద్రి !

ఆంధ్ర వాణీబాల కక్షరాల్ నేర్పిన
       "యాచార్య నన్నయ్య " కమ్మ వీవు,
ఆంధ్ర ప్రభుత్వంపు టాస్థాన కవియైన
      ఖ్యాతుదౌ "శ్రీపాద" మాత వీవు,
లలిత హాస్య రసమ్ము నొలికించు "చిలకమ
      ర్తి"ని గన్న యుత్తమ జనని వీవు,
ఖండాంతర ఖ్యాతిగను కళాకారుదౌ
       "దామెర్ల" కున్ కన్న తల్లి వీవు,
ఆదికావ్య సృష్టి కాధారభూతుదౌ
"రాజరాజ" విభుని రాణి వీవు,
సకల కళలనిధివి, సద్గుణాల పృథివి !
రమ్యగుణ మహాంధ్రి ! రాణ్మహేంద్రి !

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్య కర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు,పూజ్యకవి, యా యుగ పూరుషు కంటి వమ్మరో !

ఉరముం జూపి తుపకి గుండులకు, రౌద్రోదేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వర ధైర్యంబను మంత్రముం గొనిన శశ్వత్కీర్తియౌ "నాంధ్రకే
సరి"కిన్ మాతవు రాణ్మహేంద్రి ! కొనుమా సమ్మన భవ్యాంజలిన్.

"భమిడిపాటి" , "మద్దూరి", "న్యాపతి", "రఘుపతి",
"బ్రహ్మజ్యోస్యుల", యల "దేరాజు", "నేదు
నూరి" ముఖ్యులు నీదు కుమారులమ్మ !
మఱల గత వైభవమ్ముల వఱలుమమ్మ !

ప్రాజ్యవైభవ నిధులు, వాణిజ్యపరులు,
దానకర్ణులు, కవితా కళానిరతులు,
నీదుగారాబు కొమరులై నెగడుచుండ
చిరతర యశమ్ము గనుము,జేజేలు గొనుము.

డా .యస్వీ  రాఘవేంద్ర రావు .


హాస్య రసస్ఫూర్తి శ్రీ చిలకమర్తి

హాస్య రసస్ఫూర్తి  శ్రీ  చిలకమర్తి 

16, సెప్టెంబర్ 2015, బుధవారం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం

        తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి
              బ్రహ్మోత్సవ వాహనవైభవం
       
 . గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్
     నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
     ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా ! వాహ్యాళి గావించుచున్
     నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.

                      పెద్దశేషవాహనం

. అదిగో కాంచుడు ! శేషవాహనంబుపై సాలంకృతుండై ప్రభా
     ముదమౌ వజ్రకిరీటధారియయి యామోదాగ్రమాలల్ ధరిం
     చి, ధరాశ్రీమహిషీసమేతుడయి యా శ్రీవిష్ణురూపంబునన్

     సదయన్ వేంకటసామి భక్తతతికిన్ సాక్షాత్కరించెన్ దగన్.
                                        రచనడాయస్వీరాఘవేంద్రరావు

4, సెప్టెంబర్ 2015, శుక్రవారం

రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము

    

బ్రహ్మవాది ! రాధాకృష్ణ ! భవ్యచరిత !
కొనుము జన్మదినాంజలి కూర్మితోడ
కంటి తత్త్వాంబుధి మధించి కావ్యమణుల
మంటి వత్యాదృతిని మహి మహిత గతిని.

జాతికిన్ జీవగఱ్ఱ లాచార్యులనగ
నట్టి ఉత్కృష్ట వృత్తి జేపట్టి తీవు
సమ్మదదినము మాకు నీ జన్మదినము
శ్రీకరం బుపాధ్యాయ సంక్షేమదినము.

మోదంబందె తెలుంగుజాతి, ప్రజలామోదింప నధ్యక్షుగా
వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా
హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే
నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.

విశదమైనది నీదు విజ్ఞానధీశక్తి
      యిలలో నుపాధ్యాయవృత్తి కతన
ప్రకటితంబయ్యె నీప్రతిభ మాస్కోనగ
      రమున దౌత్యంబు నెఱపిననాడు
ఉపరాష్ట్రపతిగ, పిదప రాష్ట్రపతిగాగ
      రాణించినది నీదు రాజనీతి,
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
      కమనీయ కైవల్య కావ్యకన్య
"భారతీయ తత్త్వము" నీదు భాగ్యదుహిత,
ఆంధ్రకాశికా విశ్వవిద్యాలయముల
తగ నుపాధ్యక్షుడ వయిన ధన్యజీవి !
అందుకోవయ్య ! మా హృదయాంజలులను.

                   డా .యస్వీ రాఘవేంద్ర రావు .

9, జులై 2015, గురువారం

పీసపాటి నరసింహ మూర్తి గారి జయంతి సందర్భముగా

"నటవిద్యాధర" డా. పీసపాటి
హృద్యంబౌనె పఠింప రాగ కవితాహీనంబుగా పద్యముల్
ఆద్యంతంబు సరాగ డోలికల నోలార్చుంగదా నీదియౌ
పద్యం బో నరసింహమూర్తి ! మధు శశ్వత్పూర్ణకంఠా ! కళా
వేద్యా ! మాన్య "కళాప్రపూర్ణ నటనావిజ్ఞాన పారంగతా !
తగుమాత్రపు రాగంబున
నిగమోచ్చారణ విధాన నిస్తుల నటనన్
తగుహావభావముల నీ
పగిదిన్ పద్యము పఠించు భావుకుడేడీ !
ఏడీ నీవలె హాయిగ
పాడంగల గాయకుండు పండితవర్యా !
చూడగ నా శ్రీకృష్ణుడె
నే డీ ధర నవతరించె నీ రూపమునన్.
నటనంబును తపమంచు నెంచి ధృత నానానవ్యయోగంబులన్
పటు దీక్షన్ పలు హావభావములు నైపథ్యంబు శోధించుచున్
నటనాంభోనిధి పార మందితివి విన్నాణంబు సాధించుచున్
"నటవిద్యాధర !" కొల్లగొంటి వఖిలాంధ్ర ప్రేక్షక స్వాంతముల్.
"బెల్లపుకొండ" తీపియు, మీసపు సొగసు
మదిగోరె నిను ప్రేమ మాననీయ !
"బందా" కనకపు శోభయు, గానమాధురి
ప్రీతిగూడె నిను సంగీతరాయ !
"యడవల్లి" వారి యాయత సౌకుమార్యంబు
పట్టువడె నమేయ భాగధేయ !
"మాధవపెద్ది" సమ్మానార్హమౌ ఠీవి
పూర్ణంబుగా నబ్బె బుధవిధేయ !
"చతురభినయధురీణ !" సచ్చరిత ! "ఆంధ్ర
పద్యకవితా సదస్సు" సద్భక్తితోడ
చందురున కొక్క నూల్ప్రోగు సరణి సలుపు
సత్కృతిం గైకొనుము "నటచక్రవర్తి !"

"పద్యకవితిలక"
డా.యస్వీ.రాఘవేంద్రరావు,
ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.డి

పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, బొమ్మూరులో "తెలుగులో నదీ సాహిత్యం" పై "గోష్ఠి"


9, జూన్ 2015, మంగళవారం

"రగులుచున్న దిల రావణ కాష్ఠము"

"రగులుచున్న దిల రావణ కాష్ఠము"
దాయాదుల మధ్య, ఉగాది నాటి
నాసంశయము నిజమౌతున్నది నేడు.
చంద్రుల మధ్య సఖ్యత చేకూర్చి జనులకు
శాంతిసౌఖ్యములు చేకూర్చు మన్మథవత్సరమా!
"అవ్యాజంబగు ప్రేముడిన్ సుతుల             
                నాప్యాయంబుగా జూచుచున్
భవ్యంబై మనుచున్న జననీ స్వాంతంబు
                వ్రయ్యంబడెన్,
సవ్యంబౌనొ? మరొక్క "రావణుని కాష్ఠంబౌనొ?
                  దాయాదులన్",
దివ్యంబౌ భవితవ్యమున్ బడయగా "తెల్గుల్",
                   వరంబీయవే
నవ్యాంధ్రావని రాజధాని వెలయన్ నవ్యాబ్దమా!
                    మన్మథా!"
     "ఆంధ్రశ్రీ", "పద్యకవితిలక", "సరసకవి"
           డా. యస్వీ. రాఘవేంద్రరావు.

16, మే 2015, శనివారం

సరసకవి రాఘవేంద్ర రావు కి ఆంధ్రశ్రీ పురస్కారం


                         సాక్షి దిన పత్రిక సౌజన్యం తో
                                                              ఈనాడు దిన పత్రిక సౌజన్యం తో
                                                                                           ఆంధ్రజ్యోతి దిన పత్రిక సౌజన్యం తో

14, మే 2015, గురువారం

సర్ ఆర్థర్ కాటన్ జయంతి సందర్భముగా

                                 

                          ఉ. "కాటను" నిర్మితంబైన కట్టడముల్ బహుకాలముండె, చే

                               వాటముతోడ నీతి విడి వారధులన్ రచియింప గూలవే ?

                                నేటి స్వతంత్రభారతపు నీతిది, లంచమె రాజ్యమేలు, మో

                                 మోటములేక కోటులను మూటలుగట్టుట పాటి యయ్యెడిన్

                                                                              "పద్యకవితిలక"

                                                                       డా.యస్వీ.రాఘవేంద్రరావు,

                                                                  ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.డి

18, ఏప్రిల్ 2015, శనివారం

"అపరధాత" ఉపాధ్యాయుడు

   "అపరధాత" ఉపాధ్యాయుడు

గురువు బ్రహ్మ, తలపంగ గురువు విష్ణు
వనియు, గురు వరయగ మహేశ్వరు డనియును,
పరమ గురువు సక్షాత్పరబ్రహ్మ మనియు
నర్చ సేయరె మున్నుపాధ్యాయవర్య !

నాటి గురుశిష్యులకును నీనాటివారి
కమరియున్నట్టి సంబంధ మరసిచూడ
హస్తి మశకాంతర మన గాదతిశయోక్తి
యట్లు దిగనాడుటకు హేతు వరయవయ్య !

మఱ్ల నొకసారి తాదృశ మహితగతిని
సృష్టి గావింప గలయట్టి స్రష్ట వీవు
ఉద్ధరింపు మట్టి ఘనత నుర్వి ననఘ !
ఇచ్చు తప్పక చేయూత నీశ్వరుండు.

రాజకీయములకు సుదూరముగనుండి
బోధనము నెంచి నీ లక్ష్య సాధనముగ
పౌరులు, ప్రభుత్వమును, సురవరులు మెచ్చ
నందఱికి తలలోనాల్కవగుచు మనుము.

వృత్తులన్నింట మేలైన వృత్తి నీది
జీత బత్తెంపు పెంపుకై చింత వడక
జ్యోతివలె శిష్యులకు తెల్వి ప్రీతి నొసగి
జీవితము గడపుము చిరంజీవి వగుచు.

గాన నాట్య కవిత్వాది కళలయందు
రాజకీయార్థిక ప్రజారంగములను
వైద్య సాంకేతికాదిక విద్యలందు
తీర్చి దిద్దుము బాలుర దివ్యమూర్తి.

శక్తియుక్తుల నన్నింట రక్తి తోడ
జ్ఞానదానంబు సేసి కైంకర్య మెసగ
స్వార్థ చింతను వీడి నిశ్చల ప్రవృత్తి
ధ్యేయ పథమును వీడకు ముపాధ్యాయవర్య !

ధర్మపథమును తప్పని కర్మజీవి !
ఇలను నీ సేవ జనులు గుర్తింపకున్న
బడయుదువు దానఫలితంబు పరమునందు
రిత్తవోవునె నిస్స్వార్థ చిత్తసేవ ?

"గాంధి సత్యపథము" హృదియందు నిల్పి
"నెహ్రు నిర్మాణకుశలత" నింపి మదిని
తలచి పూజ్య "రాధాకృష్ణ దైవనిరతి",
పదిలపఱుచుము బాలుర పసిడి యెదల.
              డా .యస్వీ రాఘవేంద్ర రావు .

16, మార్చి 2015, సోమవారం

అమరజీవికి జోహారులు!


                     అమరజీవికి జోహారులు!
  పల్లవి. ఆంధ్రరాష్ట్ర సిధ్ధికై  అసువులర్పణచేసిన
          'అమరజీవీ' నీకుజోహారులయ్య! త్యాగశీలీ' నీకు జోహారులయ్య! /ఆంధ్ర/

చరణం.1.నిస్స్వార్థసేవకా! నిర్మోహనాయకా!
           నిరాడంబరమూర్తి! -నిర్మల మహాకీర్తి! /ఆంధ్ర/

         2.సంసారబంధాలు-సన్న్యసించిన యోగి!
            సంఘశ్రేయస్సుకై -సాహసించిన త్యాగి!/ఆం
 
          3.గాంధేయవాదియై -ఖాదీ ప్రచారమును
            నిర్వహించితి వీవు -నిష్ఠాగరిష్ఠతన్ /ఆంధ్ర/
 
          4.మానవుని సేవయే- మాధవుని సేవగా
             ధాత్రి ఋణమీగిన-ధన్యగుణగణ్యుడవు/ఆ
 
          5.హరిజనోధ్ధరణకై -నిరతంబుశ్రమియించి
            ఆలయప్రవేశమ్ము -కలిగించినావయ్య!/ఆం
 
          6.గట్టిదీక్షాపరుడు - పొట్టిశ్రీరాములని
             గాంధీజి మెచ్చిన -కార్యశీలుడవీవు./ఆంధ్ర
                                             "పద్యకవితిలక"
                                       డా.యస్వీ.రాఘవేంద్రరావు,
                                    ఎం.ఏ.,బి.ఇడి.,ఎం.ఫిల్.,పిహెచ్.డి