20, జూన్ 2017, మంగళవారం

"యోగము స్వాస్థ్య విద్య"

"ప్రపంచ యోగా దినోత్సవ" సందర్భంగా

             "యోగము స్వాస్థ్య విద్య"

"యోగము బ్రహ్మ విద్య, యది యోగులకే" యని
                            యెంచి రప్పు, "డా
యోగము స్వాస్థ్య విద్య, ప్రతియొక్కరు నేర్వుడు
                             సాధనంబునన్,
రోగము సోకకుండు, తనురూపము, తేజము,
                             నిల్పు నాయువున్,
త్యాగము సేయు 'డింత' సమయం"బని తెల్పె
                            'నరేంద్ర' పృథ్వికిన్.

"యోగాభ్యాసము మత"మని
రాగాలాపనము సేసి ప్రల్లద రాగాల్ 
సాగిం'చెడువారి' నెదిరి
"యోగా దిన" మిల నిల్పిన 'యోగియె మోదీ.' 

               'పద్యకవితిలక', 'సరసకవి'
             డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

17, జూన్ 2017, శనివారం

పితృదినోత్సవం' సందర్భంగా

'పితృదినోత్సవం' సందర్భంగా
మ. గురువై నేర్పితి 'వోనమాలను' సదా కూర్మిన్
ప్రసాదించుచున్,
గురువై నేర్పితి 'పద్యవిద్య' కవితల్ గూర్పంగ
ధీయుక్తిమై,
గురువున్ జేసితి నన్ను, తండ్రి కొడుకున్
గొల్వుండ నొండౌ బడిన్
అరుదౌ ఘట్టము నిర్వహింపబడెగా నచ్చోట
'స్వర్ణోత్సవాల్.'
ఉ. కొంత వయస్సు వచ్చువరకున్ దగు లాలన
పాలనంబులన్,
కొంత వయస్సు వచ్చువరకున్ తగు శిక్షణ
దండనంబులన్,
కొంత వయస్సు మీర దగు కూరిమి నేస్తపు
వర్తనంబులన్
సంతును పెంచగా వలయు జంపతులంచు
నెరింగి సాకరే ?
ఉ. బాగుగ రేల మీకు కనుపట్టకపోవుట నే
పఠించితిన్
భాగవతమ్ము, రామకథ, భారత ముఖ్య
ప్రబంధరాజముల్
ఆ గతి సాగినట్టి కవితాంబ సమర్చన
నన్ను సాకెరా !
నా గురువైతి వీవపుడు, నా గురువైతివి
'పద్య విద్యకున్.'
'పద్యకవితిలక'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

14, జూన్ 2017, బుధవారం

"నివ్వాళి"

 "నివ్వాళి"

తే. విరిపరిమళ మాస్వాదించు విధమున, మక
    రందమును జుర్రినట్లు, మాకందఫలము
    నారగించు పగిది, తృప్తి నందజేసి
    హాయిగొల్పు కదోయి నీ 'గేయకవిత'.

క. పలికిన పలుకగు గేయము,
    ఎలకోయిల తీయని పలుకే యనిపించున్, 
    జలధర గర్జనము పగిది
    నలరించును నీదు వాక్కు లనుపమ రీతిన్.

ఉ. కోకిలమాలపించు తనకోమలగీతివసంతమందె,యీ
    కోకిల విందుసేయు తనకోమలగీతుల నిత్యచైత్రమై,
    ఆ కృషికుండు కాలవశుడై వ్యవసాయముసేయ,
                                                 చేయడే
    యీ కవికర్షకాగ్రణి యథేఛ్ఛనిరంతరపద్యసేద్యమున్.


తే. నవ్య చైతన్యమూర్తివి నవకవులకు,
    భవ్యదీప్తివి వైదుష్య భావుకులకు, 
    'నవ్వని పువు' గాంచిన యో "సి.నా.రె!" నాడు
    విశదమయ్యె "విశ్వంభర" విశ్వమూర్తి.

సీ. ముంగురు లసియాడు మురిపాల వదనుడై
             చూపరు లోగొను రూపి యెవడు ?
    తెనుగుదనం బది తేటపడునటుల
             దర్శనీయాంబరధారి యెవడు ?
    చిరునవ్వు వెన్నెల చిందించు మోముతో
             నెదుటి వ్యక్తిని పల్కరించు నెవడు ?
    తెలుగు వెలుంగులు దేశ విదేశాల
              ప్రసరింపజేసిన ప్రముఖు డెవడు ?
తే. "జ్ఞానపీఠ పురస్కృతి" సత్కృతుండు
    నిత్యనూతన చైతన్యనిరతు డతడు,
    "పద్మభూషణుం" ఆచార్య ప్రతిథ సుకవి,
    దుఃఖవార్ధిలో తెలుగుల త్రోసి వేసి,
    'దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ'
    నరిగె "విశ్వంభరుండు" తా 'నమరపురికి'
    విశ్వవిఖ్యాతకీర్తి ! కవీంద్రమూర్తి !
    వైభవోజ్జ్వలదీప్తి ! "నివ్వాళు"లయ్య !

                   "పద్యకవితిలక"
          డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు
                9299659262

9, జూన్ 2017, శుక్రవారం

డాక్టర్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారికి జన్మదిన శుభాభినందనలు!

డాక్టర్ ఎస్.పి. బాల సుబ్రహ్మణ్యం గారికి
జన్మదిన శుభాభినందనలు!
సీ. మ్రోళ్లు చిగుర్పగ, రాళ్లు కరుగజేయు
కమనీయ గంధర్వ గాత్రు డెవరు?
బహుళ భాషలయందు బహుసహస్రంబుల
నేపథ్యగానాల నిపుణు డెవరు?
'పాడుతా తీయగా' పాటల తోటల
రవళించు గాయక స్రష్ట యెవరు?
'జాతీయ బహుమతుల్' సాధించి తనిసిన
ఖ్యాతుడౌ 'విశ్వగాయకు డెవండు?
తే. అట్టి "బాలు" జన్మదిన "మహంబు" నేడు
తనదుపేర 'పురస్కార' స్థాపనమున
"రావు బాలసరస్వతీదేవి" కిచ్చి,
'పుచ్చుకొనుటయెకాదు నా కిచ్చుటయును
వచ్చు' నని ఋజు వొనరించు సచ్చరిత్ర!
ప్రథిత "బాలసుబ్రహ్మణ్య!" పరమపుణ్య!
తే. 'గానగంధర్వ!' విఖ్యాత గాయకమణి!
'పద్మభూషణా!' నయగుణా! భాగ్యకీర్తి!
'పండితారాధ్య' వంశాబ్ధి 'బాల'చంద్ర!
'పొట్టి శ్రీరాము నెల్లూరి ముద్దుబిడ్ద!'
ఆయురారోగ్యభాగ్యమ్ము లందుమయ్య!
అందుకొనుమయ్య! మా "అభినందనములు!"
 '
'పద్యకవితిలక'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు
.


5, జూన్ 2017, సోమవారం

జన్మదిన శుభాకాంక్షలు

జన్మదిన శుభాకాంక్షలు
"హర్షభరమున విజయాల వర్ష మేగె"
సాహితీ కళా సంస్కృతి చాలనమున,
ప్రజల మెప్పును పొందెడు పాలనమున,
'ఏలుబడి సాగె నేడాది' లాలనమున,
'హర్షభరమున విజయాల వర్ష మేగె.'
అడుగడుగున మీకు జనత హారతిడగ,
ఒడుదొడుకు లేమి లేకుండ గడచుచుండ,
ప్రజలు 'జేజేలు' పలుకుచు లాగుచుండ,
"ప్రగతిరథ" మొక "యేడాది" పయనమయ్యె.
పేదవర్గాల పాలిటి 'పెన్ని'ధీవు,
అక్క్షయ వరము లిడు 'కల్పవృక్ష'మీవు,
ఆశ్రిత జనుల 'మందార' మైన నీవు,
'జన్మదిన మహోత్సవముల జరుపుకొనుచు,
ఆయురారోగ్యభాగ్యమ్ము లందుకొనుచు,
కీర్తి గనుమయ్య! "మల్లాడి కృష్ణరాయ!"
"పద్యకవితిలక"
డాక్టర్ సంగాడి వీరరాఘవేంద్రరావు

1, జూన్ 2017, గురువారం

ప్రపంచ క్షీర దినోత్సవం సందర్భముగా

"అమ్మదనము"
"క్షీరము సంపూర్ణపు టా
హారము, కమ్మదనమిచ్చు 'నమ్మదనము'నన్
గారము, లాలన, పాలన
మారామొనరించు సుతుకు మహిమాన్వితయై."
" పద్యకవితిలక "
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సం సందర్భముగా