20, అక్టోబర్ 2012, శనివారం

"రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు

            "రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు
                  
స్వాగతంబిదే నీకు సుస్వాగతంబు
          హాస్యనట సార్వభౌమ! చే నందుకొనుమ!
      పటువితరణాది గుణగణ్య! నటవరేణ్య!
"రమ్యకీర్తి గులాబు!"శ్రీరాజబాబు!

తేనెసోనల నొలికించు మానసమున,
             నమృతపు ఝరులు చిలికించు మమతతోడ,
 నాణిముత్యాల తులకించు వాణితోడ,
       మందహాసము పలికించు మధురమూర్తి!  

            సునిశితంపు హాస్యమ్ము నీ సొమ్ము సుమ్ము!
 ఇట్లు కడుపుబ్బ నవ్వించు టెట్టులబ్బె?
    పూర్వజన్మసంచిత మహాపుణ్య మేమొ? 
కాదు, కా దది ప్రేక్షక ఘనసుకృతము   

జననికి జన్మభూమికి ఘనత గూర్చు
సదయ! చదివితి వీవు మా సంస్థలోన
    "పూర్వవిద్యార్థి!" యిది మా కపూర్వ గర్వ
               మందుకొనుమోయి! మా హృదయాంజలులను.

నీవు సృష్టించిన నీతిచిత్రంబులే
        చటుల నిర్మాత వనుటకు సాక్షి,
నీతిదాయకములౌ నీ చిత్రగాథలే
         చటుల రచయితవనుటకు సాక్షి,
"కోరుకొండ" కిడిన భూరివిరాళమే
          అతివితరణ సుశీలతకు సాక్షి,
నవకళాకారుల నాదరించెడి తీరు
          లతిదృఢ స్నేహశీలతకు సాక్షి, 
రాజబాబు! ఆంధ్రాళి  నీరాజనంబు
లందు నిన్ను సమ్మానించు నధిక భాగ్య
మబ్బె; రాజశబ్దంబు చంద్రార్థ మగుట
నూలుపోగుగ మా"పద్యమాల" గొనుము.
    డా.యస్వి. రాఘవేంద్రరావు.