24, డిసెంబర్ 2012, సోమవారం

ప్రేమను పంచు సోదరా !


ఉ.దేవుని సన్నిధానమున దివ్యపదంబును బొందగోరుచున్ 
   జీవుడు భక్తిమార్గమున చిత్తము తన్మయతన్ భజింపగా
   దేవుని దివ్యపూరుషుగ దిక్కుగ నెంచుచు, తాను ప్రేయసీ
   భావము నొందడే ? పరమభక్తి మథింపగ ప్రేమతత్త్వమౌ

ఉ. గర్భమునందు మోసి, కని, కాచుచు స్వాస్థ్యము కంటిఱెప్పయై,
     దర్భపవిత్రమూర్తియగు తల్లి, యిలాతలా కల్పవల్లి, తా
     నిర్భరమైన వేదనము నిస్తులరీతి సహించి పెంచదే
     యర్భకపాళి వత్సలత, నయ్యది నిర్మల ప్రేమతత్త్వమౌ

మ. పదియార్వేల ముముక్షు తాపస మహాభక్తాగ్రణుల్ బొందరే ? 
      పదియార్వేల వ్రజాంగనామణులుగా వైవాహికాత్మీయతన్
      యదువంశాగ్రణితో, ముముక్షుజన లోకారాధ్యుతో, కృష్ణుతో,
      ఇది శృంగారమె ? దివ్యప్రేమమగుగానీ భక్తిమార్గంబునన్.

మ. మతమేదైననుభక్తిభావమును, సన్మార్గంబు నేర్పున్ సదా,
      అతిభక్తిన్ జనియించు ప్రేమ; పరమాత్మార్థంబు జీవుండు తా
      సతతంబున్ తపియించు; "మాదు మతమే సత్యంబు నిత్యం"బనన్
      హితమే ? అన్యమతంబులన్ దెగడుటల్ హేయంబు లన్యాయముల్.  

మ. విషవృక్షంబగు సంసృతిన్ అమృతమై వెల్గొందు రెండే ఫలాల్,
      రసవత్కావ్యములన్ పఠించి సుధలన్ ద్రావంగ నొండౌ, మరొం
      డసమానంబగు స్నేహమే; అదియె ప్రేమైక్యంబు, ప్రాణప్రదం 
      బు; సదా మిత్రుని క్షేమమున్ వలచు, ఉద్బోధించు సత్కార్యముల్.

తే. మన మతమ్మన్న మన కభిమాన మున్న
     తప్పగునె ? పరద్వేషమ్ము తప్పుగాని;
   "ఈవు జీవించు, పరుల జీవింపనిమ్ము !"
     ఏ మతమ్మైన నిదియె బోధించు మనకు
     నమ్ము! ప్రేమతత్త్వ మిదె నిజమ్ము సుమ్ము !

ఉ. ప్రేమ యొసంగదే మమత, ప్రేమ యొసంగు క్షమాగుణంబునే,
     ప్రేమ యొసంగదే సమత, ప్రేమ యొసంగు దయాగుణంబునే
     ప్రేమ యొసంగు నెయ్యమును, ప్రేమ యడంచును లోని శత్రులన్,
     ప్రేమ విశిష్టదైవతము, పెన్నిధి, ప్రేమను పంచు సోదరా !  
డా. యస్వీ. రాఘవేంద్రరావు

(ఆంధ్ర పద్యకవితాసదస్సు ది.౨౫.౧౨.౨౦౧౧ వ తేదీని నిర్వహించిన "ప్రతినెలా పద్యం" కర్యక్రమంలో నిర్వహింపబడిన "పద్యకవి సమ్మేళనం"
లో అధ్యక్షస్థానం నుండి పఠించినవి.)

ఆద్యంతం ఆకట్టుకున్న అష్టావధానం


18, డిసెంబర్ 2012, మంగళవారం

"అమరజీవి స్వాంత మల్లాడదే ?"


               
ఉ.  ఎప్పటినుండియో రగులు నీ కనిపించని యూక తోడిదౌ
     నిప్పుల కొల్మి యారదిక నిక్కముగా, తెలగాణ కాంక్షతో
     గుప్పున ప్రజ్వలించును; నిగూధముగా కుములున్, సమైక్యమున్
     ఎప్పటికైన కూర్పగలమే ? మనరాష్ట్రము శాంతి బొందునే ?

మ. ఒసగంబోరని ఆంధ్రరాష్ట్ర మిక నెన్నో విన్నపాలిచ్చినన్
      అసిధారావ్రతి పొట్టిరాముడు నిరాహారంపు దీక్షావిధిన్ 
      అసువుల్ బాసి తెలుంగు జాతికి సమైక్యాంధ్రిన్ ప్రసాదింప నీ
      విసపుంభావపుటగ్నిచే "నమరజీవి" స్వాంత మల్లాడదే ?

మ.  "పదవుల్, రాజ్యము భోజ్యమౌ గద ! సదా ప్రత్యేక రాష్ట్రంబునన్"
      ఇది యా నేతల బోధనంబు; తగ స్పందింపంగ విద్యార్థికిన్
      చదువుల్ పూజ్యము,, సమ్మెలే నిరత, మాశాపాశబంధీకృతుల్
      విధిగా వచ్చును రాష్ట్రమంచు నెఱపున్ విద్యార్థులాత్మాహుతుల్.

ఉ.   కోరిరి రాష్ట్రభాగమును కొందరు,కొదరు దాని కొప్పమిన్
      భారత సంగరంబె జరుపంగలమంచు సవాలు చేయరే ?
      కౌరవులెవ్వరో ? రణముఖంబున పాండవు లెవ్వరోగదా !
      తీరునొ కోరికల్ ? తుదకు దేవుడెఱుంగును రాష్ట్రయోగమున్.

తే.గీ. అన్నదమ్ముల యైకమత్యంబు సన్న
       గిలిన పరులదృష్టిని కడు చులుకనయగు
       తెలుగు తల్లిని మూడు ముక్కలుగ జీల్చి
       గర్భశోకము గలిగింప గడ్గువారె ?

సీ.   భాషాప్రయుక్తమౌ పద్ధతిన్ విభజించి
            రక్తిమై నొసగిన రాష్ట్ర మిద్ది,
      పార్లమెంటుకు సింహభాగము సభ్యుల
            రాజసముగ బంపు రాష్ట్ర మిద్ది,
      కేంద్ర ప్రభుత్వాన కీలకపాత్రను 
            రహిని పోషించిన రాష్ట్ర మిద్ది,
      భారత దేశంపు ప్రథమ పౌరులయిన
             రాష్ట్రపతుల గన్న రాష్ట్ర  మిద్ది,

తే.గీ. ఇన్ని భంగుల మన్నన కెక్కియున్న
       కన్నతల్లి మిన్నగు ఘనకల్పవల్లి,
       తెలుగుతల్లి, యమృతవల్లి, దివ్యధాత్రి
       చిన్న చిన్న ముక్కలయిన చిన్న బోదె ?
                                   డా.యస్వీ. రాఘవేంద్రరావు,
   
( ఆంధ్ర పద్య కవితసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"ఆంధ్రరాష్ట్రము"పై నిర్వహించిన పద్యకవిసమ్మేళనంలో గానం చేసినవి.)


15, డిసెంబర్ 2012, శనివారం

విదిత సింహవాహన ! నతుల్ విజయదుర్గ !            తే.గీ.   జగతి తల్లు లిద్దఱు సర్వ జనుల కరయ
                     నెమ్మి జన్మ నొసగి సాకు "నమ్మ" యొకతె,
                     యాపద గడవగ శుభము నభయ మొసగి
                     యల యదృశ్యగతిని గాచు "నంబ" యొకతె.

              సీ.    హరి హర బ్రహ్మ సూర్య శశి మున్నగువారి
                            శక్తి గ్రహించుటన్ "శక్తి" వైతి,
                     "చక్షురు కాలాది" సప్త సేనానుల
                             జంపి క్రోధంబున "చండి" వైతి,
                      "శుంభ నిశుంభుల" దంభ మడచి చంపి  
                              "కౌశికి నామంబు గాంచి తీవు,
                       "చండ ముండులను" గాంచగ మోము కాలమై
                               "కాళిక" నామంబు గాంచితీవు,
               తే.గీ.   "నాగలోకము పొండ"ని నైరృతులకు
                        దూతగ శివు బనిచి "శివదూతి" వైతి,
                        విజయగాథ లవెన్నియో వేనవేలు
                        విదిత సింహవాహన ! నతుల్ విజయదుర్గ !
    మ.   ధర సృష్టిస్థితినాశనంబుల త్రిమూర్తబ్రధ్నరుక్ శక్తివే !
            ధరలో నూర్జిత సత్త్వమౌ సకల భూత ప్రాణ సచ్ఛక్తివే !
            పరమాశ్చర్యము గూర్చు జీవప్రకృతిన్ వైవిధ్య ధీశక్తివే !
            స్మరణీయంబగు నీదు శక్తు లవి సామాన్యంబె శక్త్యంబికా !

    శా.    కోపోద్దీప్త మహోగ్రరూపమున నా క్రూరున్, జగత్కంటకున్
            పాపాత్మున్, వరగర్వితున్, సకలదైవప్రాంశ సంశక్తివై
            యేపారన్ రణమందునన్ "మహిషు" మర్దింపన్ త్రిశూలంబునన్
            ప్రాపించెన్ జయముల్, ప్రజల్ "విజయదుర్గా !" యంచు గీర్తింపగన్.

     ఉ.    తామస కామ సంతమస దర్పిత మూర్తులు మత్త చిత్తులౌ
            ఆ మహిషాసురాది హతకావళి జంపితి దుర్గ ! శక్తివై;
            ఈ మహి నంతకంటెను నికృష్టుల స్వైరవిహారవర్తులన్
            ఏమఱి యుంట నీకు తగునే ? దహియింపుము కంటిమంటతోన్.

                   తే.గీ.  "దుష్ట శిక్షణంబు" ధరణి "శిష్ట రక్ష
                           ణంబు" నవతార లక్ష్య మనంగ వినమె ?
                           అంబ ! పరమేశ్వరీ ! యిల నవతరించి
                           "మహి నసురుల" మర్దింపు మాత ! దుర్గ !
                                                                       యస్వీ. రాఘవేంద్రరావు.
             
        (ఆంధ్ర పద్య కవితాసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"దేవీ వైభవము"పై  నిర్వహించిన   పద్యకవిసమ్మేళనము నందు గానము చేసినవి.)
        
 

10, డిసెంబర్ 2012, సోమవారం

ప్రతి నెలా పద్యం 12 పద్య కవి సమ్మేళనాలు పుస్తక రూపము లో


సంధియుగంలో సంఘర్షణలు తప్పవు


ప్రతి నెలా పద్యం


4, నవంబర్ 2012, ఆదివారం

అభినందన

                అభినందన
కవితా ప్రక్రియల్లో ' పద్యం ' ఎంత పాతదో అంత లేతది.సంస్కృతభాష లోని వృత్తాలకి,తెలుగు వాడు తన సొంత జాతులను,ఉపజాతులనూ కలుపుకుని,సంస్కృతంలో లేని ప్రాస,వర్ణమైత్రితో కూడిన యతినియమాలు స్వచ్చందం గా విధించుకుని పద్యాన్ని సుసంపన్నం చేసుకున్నాడు.మావి సంస్కృతజన్య భాషలని గొప్పగా చెప్పుకునే ఔత్తరాహ భాషల్లో దేనిలోను ఇవాళ గణబద్ధమైన వృత్తాల్లాంటి పద్యాలు ఉన్నట్లు తోచదు.' పద్యం ' ఒక్క దాక్షిణాత్య భాషల్లోనే మిగిలిపోయింది.అందునా తెలుగులో సర్వలక్షణ లక్షితంగా తెలుగు వాడు గర్వించే సొంత ఆస్తిలా నిలిచిపోయింది.
అలాంటి ' పద్యం ' ఇప్పుడుకొన్ని చారిత్రిక పరిణామాల వల్ల కొంచెం మరుగున పడిపోయింది.
దానికి పూర్వ వైభవం సంతరించడానికి కంకణం కట్టుకున్న,బహుశా ఏకైక,సంస్థ ' ఆంధ్ర పద్య కవితా సదస్సు '.మన సంస్థ ఆవిర్భావం తర్వాతే,చాలమంది వచనకవులు గూడా పద్యకవితా ప్రాశస్త్యాన్ని గుర్తించారు.నిస్సందేహంగా ఆ ఖ్యాతి మన సంస్థదే! ' సాహితీ కౌముది ' సంపాదకుడిగా ఇవాళ ఎంతమంది పద్యకవులం అనిపించుకోడానికి ఉబలాట పడుతున్నారో నాకు తెలుసు.

ఆంధ్ర పద్య కవితాసదస్సు పద్యానికి ఇంత సేవ చేసుకోగలిగిందంటే, అది జిల్లా  శాఖల సహాయ సహకారాలు లేకుండా  సాధ్యమయ్యేదికాదు.సంస్థ ప్రారంభించిన నాటి  నుండీ,విశాఖ,హైదరాబాదు,కరీం నగర్ వంటి కొన్ని శాఖలు చాలా చురుగ్గా పని చేశాయి/చేస్తున్నాయి.

ఇటివల శ్రీ రాఘవేంద్రరావు, శ్రీ  సి.     శర్మ గార్ల సారధ్యంలో తూర్పు గోదావరి జిల్లా శాఖ గూడా ఆ కోవ లో చేరింది. వారు ' నెల నెలా పద్యం '  వంటి కార్యక్రమాల్తో, పద్యానికి విస్తృతంగా ప్రచార ప్రోత్సాహలు ఇస్తున్నారు.విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. అంతేగాక,పాఠశాలల్లో తెలుగు భాషాసం రక్షణోద్యమాన్ని ప్రచారం చేస్తూ, విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. 

ప్రతి జిల్లాశాఖా ఇలాగే పనిచేస్తే, ' కవిత్వం ' అంటే 'పద్యం ' అనే రోజు మళ్లీ రావడానికి ఎంతో కాలం పట్టదని నా దృఢ విశ్వాసం.
' నిశాపతి '
(M.H.V.Subbarao) 
ప్రధాన కార్యదర్శి,ఆంధ్రపద్య కవితా సదస్సు హైదరాబాదు.  

   

20, అక్టోబర్ 2012, శనివారం

"రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు

            "రమ్యకీర్తి గులాబు" శ్రీరాజబాబు
                  
స్వాగతంబిదే నీకు సుస్వాగతంబు
          హాస్యనట సార్వభౌమ! చే నందుకొనుమ!
      పటువితరణాది గుణగణ్య! నటవరేణ్య!
"రమ్యకీర్తి గులాబు!"శ్రీరాజబాబు!

తేనెసోనల నొలికించు మానసమున,
             నమృతపు ఝరులు చిలికించు మమతతోడ,
 నాణిముత్యాల తులకించు వాణితోడ,
       మందహాసము పలికించు మధురమూర్తి!  

            సునిశితంపు హాస్యమ్ము నీ సొమ్ము సుమ్ము!
 ఇట్లు కడుపుబ్బ నవ్వించు టెట్టులబ్బె?
    పూర్వజన్మసంచిత మహాపుణ్య మేమొ? 
కాదు, కా దది ప్రేక్షక ఘనసుకృతము   

జననికి జన్మభూమికి ఘనత గూర్చు
సదయ! చదివితి వీవు మా సంస్థలోన
    "పూర్వవిద్యార్థి!" యిది మా కపూర్వ గర్వ
               మందుకొనుమోయి! మా హృదయాంజలులను.

నీవు సృష్టించిన నీతిచిత్రంబులే
        చటుల నిర్మాత వనుటకు సాక్షి,
నీతిదాయకములౌ నీ చిత్రగాథలే
         చటుల రచయితవనుటకు సాక్షి,
"కోరుకొండ" కిడిన భూరివిరాళమే
          అతివితరణ సుశీలతకు సాక్షి,
నవకళాకారుల నాదరించెడి తీరు
          లతిదృఢ స్నేహశీలతకు సాక్షి, 
రాజబాబు! ఆంధ్రాళి  నీరాజనంబు
లందు నిన్ను సమ్మానించు నధిక భాగ్య
మబ్బె; రాజశబ్దంబు చంద్రార్థ మగుట
నూలుపోగుగ మా"పద్యమాల" గొనుము.
    డా.యస్వి. రాఘవేంద్రరావు.

28, సెప్టెంబర్ 2012, శుక్రవారం

కళాప్రపూర్ణ పీసపాటి నరసంహ మూర్తి గారితో ఇంటర్వ్యూ 1

ఇంటర్వ్యూ చేసిన వారు డా .యస్వీ రాఘవేంద్ర రావు,మరియు దివాన్ చెరువు శర్మ గారు ఆంధ్ర పద్య కవితా సదస్సు ,తూ.గో.జిల్లా.


"నటవిద్యాధర" డా. పీసపాటి

 "నటవిద్యాధర" డా. పీసపాటి  

హృద్యంబౌనె పఠింప రాగ కవితాహీనంబుగా పద్యముల్
ఆద్యంతంబు సరాగ డోలికల నోలార్చుంగదా నీదియౌ
పద్యం బో నరసింహమూర్తి ! మధు శశ్వత్పూర్ణకంఠా ! కళా
వేద్యా ! మాన్య "కళాప్రపూర్ణ నటనావిజ్ఞాన పారంగతా !

తగుమాత్రపు రాగంబున
నిగమోచ్చారణ విధాన నిస్తుల నటనన్
తగుహావభావముల నీ
పగిదిన్ పద్యము పఠించు భావుకుడేడీ !

ఏడీ నీవలె హాయిగ
పాడంగల గాయకుండు పండితవర్యా !
చూడగ నా శ్రీకృష్ణుడె 
నే డీ ధర నవతరించె నీ రూపమునన్.

నటనంబును తపమంచు నెంచి ధృత నానానవ్యయోగంబులన్
పటు దీక్షన్ పలు హావభావములు నైపథ్యంబు శోధించుచున్
నటనాంభోనిధి పార మందితివి విన్నాణంబు సాధించుచున్
"నటవిద్యాధర !" కొల్లగొంటి వఖిలాంధ్ర ప్రేక్షక స్వాంతముల్.

"బెల్లపుకొండ" తీపియు, మీసపు సొగసు
      మదిగోరె నిను ప్రేమ మాననీయ !
"బందా" కనకపు శోభయు, గానమాధురి
      ప్రీతిగూడె నిను సంగీతరాయ !
"యడవల్లి" వారి యాయత సౌకుమార్యంబు
      పట్టువడె నమేయ భాగధేయ !
"మాధవపెద్ది" సమ్మానార్హమౌ ఠీవి
      పూర్ణంబుగా నబ్బె బుధవిధేయ !
"చతురభినయధురీణ !" సచ్చరిత ! "ఆంధ్ర
పద్యకవితా సదస్సు" సద్భక్తితోడ
చందురున కొక్క నూల్ప్రోగు సరణి సలుపు
సత్కృతిం గైకొనుము "నటచక్రవర్తి !"

రచన డా .యస్వీ రాఘవేంద్ర రావు .

25, సెప్టెంబర్ 2012, మంగళవారం

అశ్వవాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

     అశ్వవాహనం

                       తే. శిష్టరక్షణంబును దుష్టశిక్షణమును
                                 జేయ ధరణి నవతరించు శ్రీశు డదిగొ !
                                 ఖడ్గధారియై వధియింప కలిపురుషుని
                            అశ్వవాహనమున ఠీవి నధివసించి
                              కల్కిరూపుడై స్వామి సాక్షాత్కరించె. 
 

స్వర్ణరథోత్సవం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

    స్వర్ణరథోత్సవం

                 తే. దాసభక్తుల నృత్యాలు వాసి గాంచ
                                 భజనబృందాలు ముందుగా వచ్చుచుండ
                  వేడ్క శ్రీదేవి భూదేవి వెంటరాగ
                       సాగె నల్లదే శ్రీస్వామి స్వర్ణరథము
                                     కనులు మిరుమిట్లుగొల్పెడు కాంచుడయ్య                                 
     !

24, సెప్టెంబర్ 2012, సోమవారం

చంద్రప్రభవాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు


                         చంద్రప్రభవాహనం

                      తే. చంద్రసూర్యులు నీదు లోచనములయ్య !
                    చంద్రికాతిశీతలము నీ చల్వచూపు
                కోటిచంద్రప్రకాశ ! కోనేటిరాయ !
                          చేత వెన్నముద్దను దాల్చి చిన్నికృష్ణ !
                        వెన్నెలందున విహరించు వేడ్కమీఱ
                    భక్తపాల ! చంద్రప్రభవాహనమున
                            మాడవీదుల విహరించు మహితమూర్తి !
                       శ్రితజనులను రక్షింపుము శ్రీనివాస


                                          

సూర్యప్రభవాహనం

 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

       సూర్యప్రభవాహనం    

       తే. చంద్రసూర్యులే నీదు వీక్శణములయ్య !
     కోటిసూర్యప్రకాశ ! యో కూర్మిదేవ !
     భవ్యదివ్యసూర్యప్రభ వాహనమున
            తరలివచ్చితి వరద ! యో తిరుమలేశ !
                ధన్యులము మేము నీ దివ్యదర్శనమున.

23, సెప్టెంబర్ 2012, ఆదివారం

గజవాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

గజవాహనం                    

                     తే. ఇంద్రు డంపిన యైరావతేభమందు
                           వైభవోపేతముగ స్వామి వచ్చె నేడు
                            శ్వేతగజమున వేవేల వెలుగు నింపి
                                భక్తహృదయపద్మమ్ములు పరిమళింప
                                 ప్రముదమంది బ్రహ్మోత్సవ వర్తనముల
                                     నింద్రుడు కురియించెను పుష్పవృష్టి నేడు.


22, సెప్టెంబర్ 2012, శనివారం

హనుమద్వాహనం

 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు


        హనుమద్వాహనం

                 తే. రాము నమ్మినబంటుగా రాణకెక్కి,
                    స్వామిభక్తిపరాయణవరు డనంగ
                                  ఘనతనొందిన యంజనాతనయు డదిగొ !
                            శ్రీశు దనమూపుపై బెట్టి మోసికొనుచు
                                      వచ్చె నదె కాంచుడు "హనుమద్వాహనంబు."


గరుడ వాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

          గరుడ వాహనం

ఉ. శ్రీహరి కృష్ణదేవులకు సేవకుదౌ "గడాళువారు" తా
    వాహనమయ్యె శేషగిరివాసున కీ కలిలో గిరీంద్రమై
                     యాహవదోహదుం డయిన యా గరుడుండు నివాసమై; ప్రజా
                    వాహిని బ్రోవ శ్రీపతియై వచ్చెను బ్రహ్మమహోత్సవంబులన్.21, సెప్టెంబర్ 2012, శుక్రవారం

మోహినీ అవతారం

 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

                  మోహినీ అవతారం 

                 తే. తను జగన్మోహినీరూప ధారణమున

                           దేవతల కమృతం బిచ్చిన దివ్యు డదిగొ
                         మోహినీయవతారాన ముద్దులొలుక,
                    వెన్నముద్దను జేపట్టి వెన్నదొంగ
                       వేఱు వేఱు వాహనముల వేడ్కతోడ
                 భక్తకోటిని పాలింప వచ్చె నేడు.
20, సెప్టెంబర్ 2012, గురువారం

సర్వభూపాల వాహనం


తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం         రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు


    సర్వభూపాల వాహనం

 తే. అష్టదిక్పాలభూపాలు రందరైరి
                   స్వామి మలయప్పవారికి వాహనముగ
               పట్టమహిషులతో గూడి పట్టణమున
             మాడవీదుల నూరేగి మహితమూర్త       
        భక్తజనుల బ్రోవగ ననురక్తితోడ
               కాళియవిమర్దనుండయి కానుపించి
                      సర్వభూపాలవాహనమున స్వామి వచ్చె
                   కనుడు జనులార ! కన్నులకఱవు దీఱ.తెలుగు భాషకు ఉచ్చారణ ప్రధానం


ముత్యపుపందిరి వాహనం

 తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు


                ముత్యపుపందిరి వాహనం

ఉ. ఆశ్రితకల్పవృక్షమగు నా వకుళాతనయుండు కృష్ణుడై
    విశ్రుత గోపబాలుడయి వేడుక గోవులపాలకుండుగా
             నాశ్రయకల్పవృక్ష మహిమాన్విత వాహనమందు వచ్చె ని
         త్యాశ్రితభక్తకోటి మహిమాన్వితుడై వరదుండు బ్రోవగన్.


19, సెప్టెంబర్ 2012, బుధవారం

సింహవాహనం

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

                   సింహవాహనం

          తే. స్వామి మలయప్ప యల సింహవాహనమున
మాడవీదుల నూరేగి మమ్ము బ్రోవ
   దర్శనంబీయ మాజన్మ ధన్యమయ్యె
   నాటి ప్రహ్లాదవరదుడా ! నారసింహ !
 వేంకటేశ్వర నిన్ను నే వేడుకొందు.


హంసవాహనం

   తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి   బ్రహ్మోత్సవ వాహనవైభవం   

      రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు

                       హంసవాహనం

 ఉ. వెన్నెలవన్నె మైమెఱుపు వెల్లనివల్వలు వీణె దాల్చియున్

     వెన్నెల చల్వచూపులను వెల్లువగొల్పు కృపారసంబునన్

వెన్నెలవంటి కీర్తి నిల విద్దెలు నేర్చినవారికిచ్చుచున్

        వెన్నెలవేళ నంచపయి వేడుక వచ్చెడు స్వామి గొల్చుడీ !.


     

18, సెప్టెంబర్ 2012, మంగళవారం

విఘ్నపతి స్తుతి

వినాయక చవితి శుభాకాంక్షలు 


  రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు
చిన్నశేషవాహనం

  తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి  బ్రహ్మోత్సవ వాహనవైభవం 
     

        రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు 

            చిన్నశేషవాహనం


        తే. వరదుడై వేణుమోహను భంగిమమున
                స్వామి మలయప్ప చినశేషవాహనమున
          మాడవీదుల విహరించు మహిత ఠీవి
              దర్శనంబును బొందుడు ధన్యులగుడు.


పెద్దశేష వాహనం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి  బ్రహ్మోత్సవ వాహనవైభవం 

 

  రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు
                    
. అదిగో కాంచుడు ! శేషవాహనంబుపై సాలంకృతుండై ప్రభా
     ముదమౌ వజ్రకిరీటధారియయి యామోదాగ్రమాలల్ ధరిం
     చి, ధరాశ్రీమహిషీసమేతుడయి యా శ్రీవిష్ణురూపంబునన్
     సదయన్ వేంకటసామి భక్తతతికిన్ సాక్షాత్కరించెన్ దగన్.

17, సెప్టెంబర్ 2012, సోమవారం

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవ వాహనవైభవం 1

     రచన: డా. యస్వీ. రాఘవేంద్రరావు


. గజశేషాదిక వాహనంబుల సువిఖ్యాతాప్త దేవేరులున్ 
           నిజపట్టంబున మాడవీదుల సదా నీలాభ్రదేహుండు తా
                      ధ్వజఛత్రాదిక లాంఛనంబుల భళా ! వాహ్యాళి గావించుచున్
     నిజభక్తాళికి దర్శనం బిడు శతానీకాతిభోగంబులన్.