4, సెప్టెంబర్ 2014, గురువారం

రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము

 
బ్రహ్మవాది ! రాధాకృష్ణ ! భవ్యచరిత !
కొనుము జన్మదినాంజలి కూర్మితోడ
కంటి తత్త్వాంబుధి మధించి కావ్యమణుల
మంటి వత్యాదృతిని మహి మహిత గతిని.

జాతికిన్ జీవగఱ్ఱ లాచార్యులనగ
నట్టి ఉత్కృష్ట వృత్తి జేపట్టి తీవు
సమ్మదదినము మాకు నీ జన్మదినము
శ్రీకరం బుపాధ్యాయ సంక్షేమదినము.

మోదంబందె తెలుంగుజాతి, ప్రజలామోదింప నధ్యక్షుగా
వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా
హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే
నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.

విశదమైనది నీదు విజ్ఞానధీశక్తి
      యిలలో నుపాధ్యాయవృత్తి కతన
ప్రకటితంబయ్యె నీప్రతిభ మాస్కోనగ
      రమున దౌత్యంబు నెఱపిననాడు
ఉపరాష్ట్రపతిగ, పిదప రాష్ట్రపతిగాగ
      రాణించినది నీదు రాజనీతి,
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
      కమనీయ కైవల్య కావ్యకన్య
"భారతీయ తత్త్వము" నీదు భాగ్యదుహిత,
ఆంధ్రకాశికా విశ్వవిద్యాలయముల
తగ నుపాధ్యక్షుడ వయిన ధన్యజీవి !
అందుకోవయ్య ! మా హృదయాంజలులను.
                   డా .యస్వీ రాఘవేంద్ర రావు .

              "అపరధాత" ఉపాధ్యాయుడు

గురువు బ్రహ్మ, తలపంగ గురువు విష్ణు
వనియు, గురు వరయగ మహేశ్వరు డనియును,
పరమ గురువు సక్షాత్పరబ్రహ్మ మనియు
నర్చ సేయరె మున్నుపాధ్యాయవర్య !

నాటి గురుశిష్యులకును నీనాటివారి
కమరియున్నట్టి సంబంధ మరసిచూడ
హస్తి మశకాంతర మన గాదతిశయోక్తి
యట్లు దిగనాడుటకు హేతు వరయవయ్య !

మఱ్ల నొకసారి తాదృశ మహితగతిని
సృష్టి గావింప గలయట్టి స్రష్ట వీవు
ఉద్ధరింపు మట్టి ఘనత నుర్వి ననఘ !
ఇచ్చు తప్పక చేయూత నీశ్వరుండు.

రాజకీయములకు సుదూరముగనుండి
బోధనము నెంచి నీ లక్ష్య సాధనముగ
పౌరులు, ప్రభుత్వమును, సురవరులు మెచ్చ
నందఱికి తలలోనాల్కవగుచు మనుము.

వృత్తులన్నింట మేలైన వృత్తి నీది
జీత బత్తెంపు పెంపుకై చింత వడక
జ్యోతివలె శిష్యులకు తెల్వి ప్రీతి నొసగి
జీవితము గడపుము చిరంజీవి వగుచు.

గాన నాట్య కవిత్వాది కళలయందు
రాజకీయార్థిక ప్రజారంగములను
వైద్య సాంకేతికాదిక విద్యలందు
తీర్చి దిద్దుము బాలుర దివ్యమూర్తి.

శక్తియుక్తుల నన్నింట రక్తి తోడ
జ్ఞానదానంబు సేసి కైంకర్య మెసగ
స్వార్థ చింతను వీడి నిశ్చల ప్రవృత్తి
ధ్యేయ పథమును వీడకు ముపాధ్యాయవర్య !

ధర్మపథమును తప్పని కర్మజీవి !
ఇలను నీ సేవ జనులు గుర్తింపకున్న
బడయుదువు దానఫలితంబు పరమునందు
రిత్తవోవునె నిస్స్వార్థ చిత్తసేవ ?

"గాంధి సత్యపథము" హృదియందు నిల్పి
"నెహ్రు నిర్మాణకుశలత" నింపి మదిని
తలచి పూజ్య "రాధాకృష్ణ దైవనిరతి",
పదిలపఱుచుము బాలుర పసిడి యెదల.
              డా .యస్వీ రాఘవేంద్ర రావు .