24, డిసెంబర్ 2012, సోమవారం

ప్రేమను పంచు సోదరా !


ఉ.దేవుని సన్నిధానమున దివ్యపదంబును బొందగోరుచున్ 
   జీవుడు భక్తిమార్గమున చిత్తము తన్మయతన్ భజింపగా
   దేవుని దివ్యపూరుషుగ దిక్కుగ నెంచుచు, తాను ప్రేయసీ
   భావము నొందడే ? పరమభక్తి మథింపగ ప్రేమతత్త్వమౌ

ఉ. గర్భమునందు మోసి, కని, కాచుచు స్వాస్థ్యము కంటిఱెప్పయై,
     దర్భపవిత్రమూర్తియగు తల్లి, యిలాతలా కల్పవల్లి, తా
     నిర్భరమైన వేదనము నిస్తులరీతి సహించి పెంచదే
     యర్భకపాళి వత్సలత, నయ్యది నిర్మల ప్రేమతత్త్వమౌ

మ. పదియార్వేల ముముక్షు తాపస మహాభక్తాగ్రణుల్ బొందరే ? 
      పదియార్వేల వ్రజాంగనామణులుగా వైవాహికాత్మీయతన్
      యదువంశాగ్రణితో, ముముక్షుజన లోకారాధ్యుతో, కృష్ణుతో,
      ఇది శృంగారమె ? దివ్యప్రేమమగుగానీ భక్తిమార్గంబునన్.

మ. మతమేదైననుభక్తిభావమును, సన్మార్గంబు నేర్పున్ సదా,
      అతిభక్తిన్ జనియించు ప్రేమ; పరమాత్మార్థంబు జీవుండు తా
      సతతంబున్ తపియించు; "మాదు మతమే సత్యంబు నిత్యం"బనన్
      హితమే ? అన్యమతంబులన్ దెగడుటల్ హేయంబు లన్యాయముల్.  

మ. విషవృక్షంబగు సంసృతిన్ అమృతమై వెల్గొందు రెండే ఫలాల్,
      రసవత్కావ్యములన్ పఠించి సుధలన్ ద్రావంగ నొండౌ, మరొం
      డసమానంబగు స్నేహమే; అదియె ప్రేమైక్యంబు, ప్రాణప్రదం 
      బు; సదా మిత్రుని క్షేమమున్ వలచు, ఉద్బోధించు సత్కార్యముల్.

తే. మన మతమ్మన్న మన కభిమాన మున్న
     తప్పగునె ? పరద్వేషమ్ము తప్పుగాని;
   "ఈవు జీవించు, పరుల జీవింపనిమ్ము !"
     ఏ మతమ్మైన నిదియె బోధించు మనకు
     నమ్ము! ప్రేమతత్త్వ మిదె నిజమ్ము సుమ్ము !

ఉ. ప్రేమ యొసంగదే మమత, ప్రేమ యొసంగు క్షమాగుణంబునే,
     ప్రేమ యొసంగదే సమత, ప్రేమ యొసంగు దయాగుణంబునే
     ప్రేమ యొసంగు నెయ్యమును, ప్రేమ యడంచును లోని శత్రులన్,
     ప్రేమ విశిష్టదైవతము, పెన్నిధి, ప్రేమను పంచు సోదరా !  
డా. యస్వీ. రాఘవేంద్రరావు

(ఆంధ్ర పద్యకవితాసదస్సు ది.౨౫.౧౨.౨౦౧౧ వ తేదీని నిర్వహించిన "ప్రతినెలా పద్యం" కర్యక్రమంలో నిర్వహింపబడిన "పద్యకవి సమ్మేళనం"
లో అధ్యక్షస్థానం నుండి పఠించినవి.)

ఆద్యంతం ఆకట్టుకున్న అష్టావధానం


18, డిసెంబర్ 2012, మంగళవారం

"అమరజీవి స్వాంత మల్లాడదే ?"


               
ఉ.  ఎప్పటినుండియో రగులు నీ కనిపించని యూక తోడిదౌ
     నిప్పుల కొల్మి యారదిక నిక్కముగా, తెలగాణ కాంక్షతో
     గుప్పున ప్రజ్వలించును; నిగూధముగా కుములున్, సమైక్యమున్
     ఎప్పటికైన కూర్పగలమే ? మనరాష్ట్రము శాంతి బొందునే ?

మ. ఒసగంబోరని ఆంధ్రరాష్ట్ర మిక నెన్నో విన్నపాలిచ్చినన్
      అసిధారావ్రతి పొట్టిరాముడు నిరాహారంపు దీక్షావిధిన్ 
      అసువుల్ బాసి తెలుంగు జాతికి సమైక్యాంధ్రిన్ ప్రసాదింప నీ
      విసపుంభావపుటగ్నిచే "నమరజీవి" స్వాంత మల్లాడదే ?

మ.  "పదవుల్, రాజ్యము భోజ్యమౌ గద ! సదా ప్రత్యేక రాష్ట్రంబునన్"
      ఇది యా నేతల బోధనంబు; తగ స్పందింపంగ విద్యార్థికిన్
      చదువుల్ పూజ్యము,, సమ్మెలే నిరత, మాశాపాశబంధీకృతుల్
      విధిగా వచ్చును రాష్ట్రమంచు నెఱపున్ విద్యార్థులాత్మాహుతుల్.

ఉ.   కోరిరి రాష్ట్రభాగమును కొందరు,కొదరు దాని కొప్పమిన్
      భారత సంగరంబె జరుపంగలమంచు సవాలు చేయరే ?
      కౌరవులెవ్వరో ? రణముఖంబున పాండవు లెవ్వరోగదా !
      తీరునొ కోరికల్ ? తుదకు దేవుడెఱుంగును రాష్ట్రయోగమున్.

తే.గీ. అన్నదమ్ముల యైకమత్యంబు సన్న
       గిలిన పరులదృష్టిని కడు చులుకనయగు
       తెలుగు తల్లిని మూడు ముక్కలుగ జీల్చి
       గర్భశోకము గలిగింప గడ్గువారె ?

సీ.   భాషాప్రయుక్తమౌ పద్ధతిన్ విభజించి
            రక్తిమై నొసగిన రాష్ట్ర మిద్ది,
      పార్లమెంటుకు సింహభాగము సభ్యుల
            రాజసముగ బంపు రాష్ట్ర మిద్ది,
      కేంద్ర ప్రభుత్వాన కీలకపాత్రను 
            రహిని పోషించిన రాష్ట్ర మిద్ది,
      భారత దేశంపు ప్రథమ పౌరులయిన
             రాష్ట్రపతుల గన్న రాష్ట్ర  మిద్ది,

తే.గీ. ఇన్ని భంగుల మన్నన కెక్కియున్న
       కన్నతల్లి మిన్నగు ఘనకల్పవల్లి,
       తెలుగుతల్లి, యమృతవల్లి, దివ్యధాత్రి
       చిన్న చిన్న ముక్కలయిన చిన్న బోదె ?
                                   డా.యస్వీ. రాఘవేంద్రరావు,
   
( ఆంధ్ర పద్య కవితసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"ఆంధ్రరాష్ట్రము"పై నిర్వహించిన పద్యకవిసమ్మేళనంలో గానం చేసినవి.)


15, డిసెంబర్ 2012, శనివారం

విదిత సింహవాహన ! నతుల్ విజయదుర్గ !



            తే.గీ.   జగతి తల్లు లిద్దఱు సర్వ జనుల కరయ
                     నెమ్మి జన్మ నొసగి సాకు "నమ్మ" యొకతె,
                     యాపద గడవగ శుభము నభయ మొసగి
                     యల యదృశ్యగతిని గాచు "నంబ" యొకతె.

              సీ.    హరి హర బ్రహ్మ సూర్య శశి మున్నగువారి
                            శక్తి గ్రహించుటన్ "శక్తి" వైతి,
                     "చక్షురు కాలాది" సప్త సేనానుల
                             జంపి క్రోధంబున "చండి" వైతి,
                      "శుంభ నిశుంభుల" దంభ మడచి చంపి  
                              "కౌశికి నామంబు గాంచి తీవు,
                       "చండ ముండులను" గాంచగ మోము కాలమై
                               "కాళిక" నామంబు గాంచితీవు,
               తే.గీ.   "నాగలోకము పొండ"ని నైరృతులకు
                        దూతగ శివు బనిచి "శివదూతి" వైతి,
                        విజయగాథ లవెన్నియో వేనవేలు
                        విదిత సింహవాహన ! నతుల్ విజయదుర్గ !
    మ.   ధర సృష్టిస్థితినాశనంబుల త్రిమూర్తబ్రధ్నరుక్ శక్తివే !
            ధరలో నూర్జిత సత్త్వమౌ సకల భూత ప్రాణ సచ్ఛక్తివే !
            పరమాశ్చర్యము గూర్చు జీవప్రకృతిన్ వైవిధ్య ధీశక్తివే !
            స్మరణీయంబగు నీదు శక్తు లవి సామాన్యంబె శక్త్యంబికా !

    శా.    కోపోద్దీప్త మహోగ్రరూపమున నా క్రూరున్, జగత్కంటకున్
            పాపాత్మున్, వరగర్వితున్, సకలదైవప్రాంశ సంశక్తివై
            యేపారన్ రణమందునన్ "మహిషు" మర్దింపన్ త్రిశూలంబునన్
            ప్రాపించెన్ జయముల్, ప్రజల్ "విజయదుర్గా !" యంచు గీర్తింపగన్.

     ఉ.    తామస కామ సంతమస దర్పిత మూర్తులు మత్త చిత్తులౌ
            ఆ మహిషాసురాది హతకావళి జంపితి దుర్గ ! శక్తివై;
            ఈ మహి నంతకంటెను నికృష్టుల స్వైరవిహారవర్తులన్
            ఏమఱి యుంట నీకు తగునే ? దహియింపుము కంటిమంటతోన్.

                   తే.గీ.  "దుష్ట శిక్షణంబు" ధరణి "శిష్ట రక్ష
                           ణంబు" నవతార లక్ష్య మనంగ వినమె ?
                           అంబ ! పరమేశ్వరీ ! యిల నవతరించి
                           "మహి నసురుల" మర్దింపు మాత ! దుర్గ !
                                                                       యస్వీ. రాఘవేంద్రరావు.
             
        (ఆంధ్ర పద్య కవితాసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"దేవీ వైభవము"పై  నిర్వహించిన   పద్యకవిసమ్మేళనము నందు గానము చేసినవి.)