13, నవంబర్ 2014, గురువారం

12, నవంబర్ 2014, బుధవారం

తరు వేదన

                           తరు వేదన

"చల్లని నీడ నిచ్చి కడు చల్లని గాలుల సేద దేర్చుచున్
తల్లి వలెన్ ఫలంబు లిడి తాపము నాకలి తీర్చుచున్
పెల్లగు తాల్మి తోడ మది భేద మదేమియు లేక సాకుచున్
నెల్లరి యుల్లముల్ తనుపు నిట్టి మమున్ వధియింప న్యాయమే !"

"మానుల పెంచి యాకసము మక్కువ ముద్దులు వెట్టనెంచు మా
మేనులు గొడ్డటన్ నఱికి మిక్కిలి చేతులు కోసి కోసి నె
మ్మేనులు చీల్చి ఱంపముల, మేకులు కొట్టియు, పట్టి చిత్రికల్
మానవ ! తోమి తోమి దయమాలి వధింతురు దారుణంబుగన్."

"బిడ్డల వోలె సాకి కడు ప్రేమను పెంచిన గొడ్డు గోదలన్
దుడ్డున కొక్క వ్రేట తల ద్రుంచు కసాయికి నమ్మునట్లుగా
బిడ్డల వోలె సాకి మము పెంచి బలిష్ఠముగాగ సొమ్ముకై
గొడ్డలి పాలు చేయుదురు క్రూర గతిన్ మమతా విహీనతన్."

"మేనులు బాసి పెంచుదుము మీ గృహసీమల వన్నె వాసి, మీ
మేనులు మోసి పంచుదుము మీకు మహా సుఖభోగరాశి, మీ
మేనులు మూసి మానమును మెండుగ గూర్చెడు నంబరంబులన్
లోన భరించు మమ్ముల కనుంగొన రెంత కృతఘ్నభావమో !"

"చల్లని నేలతల్లి యొడి చక్కగ చేరిన నాటి నుండియున్
మెల్లగ రోజు రోజునకు మేనులు పెంచుచు కేలు చాచుచున్
చల్లని పిల్లగాలిచెలి చక్కిలిగింతల డోల లూగు మ
మ్మల్లరి పెట్టగాదగునె ? యాకులు, కొమ్మలు దూసి కోసియున్."

"దినదిన గండమై బ్రతుకు దీనుల పాలిట జాలి చూపకన్
చెనకుట క్రీడ కొందరి కిసీ ! పలు దోమగ కొమ్మలన్ పుటు
క్కున విఱుపంగ క్రీడ మఱి కొందరికిన్; పసులే నయంబు క్షు
త్తను ననలంబు బాపుకొన నాకులె మేయును హాని చేయకన్."

"సంతతి పెంపు సేయు ఋతుచక్ర సమాగత హర్షవేళలన్
హంతకులట్లు పిండముల నంతము సేసి తదీయ సారమున్
ముంతల బొట్టు బొట్టులుగ మొత్తము పట్టుచు మత్తుమీర సే
వింతురు వ్యగ్రచిత్తులయి వీరవిహార వినోదకాములై."

"కుత్తుక కత్తితో సగము కోయుచు, కోయుచు లొట్టిగట్టి మా
నెత్తురు చుక్క చుక్కలుగ నిచ్చలు పిండుకు త్రావుచున్ కడున్
మత్తిలి దారపుత్రులను మాపులు రేపులు బాధ పెట్టుటన్
ఉత్తమ చిత్తహింస ద్విగుణోధ్దుర మౌచు ధరన్  కలంపదే ?"

"మందులు, మాకులున్, ఫలసుమంబులు, పత్రసమూలకాండముల్
డెందము సంతసింప నిబిడీకృతశక్తులు ధారవోసి మీ
కందుల,వృధ్ధులన్, మరణకామిని కౌగిట చిక్కు రోగులన్
పొందగ నాయురున్నతులు ప్రోతుము; మమ్ముల నొంచుటొప్పునే ?"
[ధాతృ నామ సంవత్సర ఉగాది సందర్భంగా పొట్టి శ్రీరాములు తెలుగు
విశ్వ విద్యాలయంలో ఆచార్య సి.రమణయ్యగారి అధ్యక్షతను నిర్వహింప
బడిన కవిసమ్మేళనంలో గానం చేసినవి.]
                                        డా .యస్వీ  రాఘవేంద్ర రావు .


11, నవంబర్ 2014, మంగళవారం

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !
కొమ్మల కొమ్మవై, అనదగుమ్మల బాముల బాప నమ్మవై,
పిమ్మట రాజ్యలక్ష్మివయి, పేదల పాలిటి భాగ్యలక్ష్మివై,
సమ్మదమంద గూర్చితివి జంటల పెండిలి పేరటాలివై,
యెమ్మెయి తీఱు నీదు ఋణ మిమ్మహి ? తీఱదు జన్మజన్మలన్.

"కన్నప్రేమ" కన్నమిన్న "పెంచిన ప్రేమ"
యన్న సూక్తి నిక్క మయ్యెనమ్మ !
మీకు సంతు లేమి లోకుల భాగ్యమ్ము
జాలి పంట పండె జంట యెదల.

మూగవోయిన వీణలు మ్రోగ గల్గె,
వాడిపోయిన కుసుమాలు వాసి గాంచె
ప్రాజ్య కారుణ్య వారాశి ! "రాజ్యలక్ష్మి !"
ధన్య మానవతామూర్తి ! మాన్య కీర్తి !

దిక్కు మొక్కును లేక దీన స్థితిని గుందు
        సారసాక్షుల ప్రీతి సాకు నేర్పు,
ముక్కుపచ్చారని మురిపాలు నేరని
        బాల వితంతుల నేలు నేర్పు,
గాజుల పూవుల మోజు తీరని ముగ్ధ
        తరుణాబ్జముఖుల నోదార్చు నేర్పు,
"వంటయింటికె", "చంటిపాపలకే యింతి,
        చదువేల ?" యనువారి నెదురు నేర్పు,

తల్లి ! నీ కివి జన్మజాత సుగుణంబు
లట్టి నీచేత మగడు విఖ్యాతి మెఱసె
భర్తృభావానుకూలశుంభత్ప్రవృత్తి !
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

(శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మిగారి౧౨౫ వ జయంత్యుత్సవం
సందర్భంగా ది.౧౫.౧౧.౧౯౭౫ తేదీని జరిగిన సభలో గానం చేసినవి.)
 డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

8, నవంబర్ 2014, శనివారం

3, నవంబర్ 2014, సోమవారం

" దివ్యగీత "

                                        " దివ్యగీత "

ఉ. తెల్లదొరల్ ప్రజాహితమె ధ్యేయ మటంచు దలంచి యేలరే ?
    కొల్లగొనంగలేదె పలుకోటుల దెల్లముగా; స్వదేశులౌ
    నల్లదొరల్ ప్రజా౨హితమె ధ్యేయమటంచు దలంచి యేలుచున్
    కొల్లగొనంగ దాచె పలుకోటుల "నల్లధనంబు"  బ్యాంకులన్.

 ఉ. "కాటను" నిర్మితంబైన కట్టడముల్ బహుకాలముండె, చే
     వాటముతోడ నీతి విడి వారధులన్ రచియింప గూలవే ?
     నేటి స్వతంత్రభారతపు నీతిది, లంచమె రాజ్యమేలు, మో
     మోటములేక కోటులను మూటలుగట్టుట పాటి యయ్యెడిన్.

 గీ.  "మనకు స్వాతంత్ర్యమేతెంచె, మనకు స్వేచ్ఛ
     మనప్రజలు, మనదేశంబు, మనధనంబు
     తినినయంతయు తిని దాచుకొనగవలయు"
     నేతలకిదె నేడిల "దివ్య గీత" యయ్యె.

 మ. పరదాస్యంబున మ్రగ్గుచున్న భరతాంబాశృంఖలాఛేదనన్
      అరదండంబుల, లాఠిదెబ్బలను, కారాగారవాసంబులన్
      అరుసంబొప్పగ స్వీకరించి గత నేత్రాగ్రేసరుల్ గ్రాలరే ?
      తరలింపంగ ప్రజాధనంబు మన నేతల్ దక్షతన్ మీఱరే ?
     
 ఉ.  లంచము "ఫైలు" సాగుటకు, లంచము కార్యము పూర్తియౌటకున్,
      లంచము "జన్మపత్రముల", లంచము పొందగ "చావుపత్రముల్",
      లంచము "దైవవీక్షణకు", లంచము "ధార్మికవైద్యశాలలన్",
      లంచమయంబు సర్వధర, లంచమె లంచమె రాజ్యమేలెడిన్.

  గీ.  "కుంభకోణాల" మాటున కూడబెట్టి
      దోచు సొమ్ము విదేశాల దాచుకొనుచు
      "బ్యాంకు లాకర్లు పట్టక పసిడి దాచ
      పాన్పు, సింహపీఠులజేసి స్వర్ణమయము
      "ఇంద్రవైభవంబు, కుబేరసాంద్రనిధులు
      స్వంత" మని విఱ్ఱవీగెడు స్వార్ఠపరుల
      "భరతము"ను బట్టగా బూనవలయు "యువత".

  గీ.  "లోకపాల్ బిల్లు" చర్చలలో నవగత
      మయ్యె నేతృమనోగత మందఱి కిల,
      వేళ్ళుబారిన "యవినీతివృక్షతతుల"
      సర్వనాశనమ్ము మనకు సాధ్యమగునొ !
(ది. ౨౬.౦౧.౨౦౧౨ తేదీని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీకళాశాలలో "స్వతంత్ర
భారతంలో అవినీతి" అనే విషయంపై ఆంధ్రపద్యకవితాసదస్సు తూర్పు గోదావరి
జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన పద్యకవిసమ్మేళనానికి అధ్యక్షత వహించి
గానం చేయబడినవి.)

1, నవంబర్ 2014, శనివారం

భావకవివార్య! దేవులపల్లి వంశ్య !


"మనతెలుగు - తెలుగుతల్లి"

                  "మనతెలుగు - తెలుగుతల్లి"
                              (గేయం)
పల్లవి. తేట తేట మాటలకు - ఆటపట్టు మన తెలుగు
తీయని జాతీయాల - తేనెపట్టు మన తెలుగు || తేట తేట ||
చ. 1. మల్లె విరితావి వోలె - ఉల్ల మలరించు తెలుగు
మలయమారుతము వోలె - పులకింత గూర్చు తెలుగు || తేట తేట ||
2. ఆపాత మధురంబై - హర్ష మొందించు తెలుగు
ఆలోచనామృతమై - ఆనంద మందించు తెలుగు || తేటతేట ||
3. మృణాళ నాళము పగిది - మృదులంబైనది తెలుగు
తేనెసోనల పురుడించు - తియ్యందనాల తెలుగు || తేటతేట ||
4. అవధానకళ కెంతో- అద్దము పట్టిన తెలుగు
కర్ణపర్వ పద్యమును - కన్నతల్లి మనతెలుగు || తేటతేట ||
5. అతిథుల నభ్యాగతుల - నాదరించు జాతి తెలుగు
మహిత పూర్వ సంస్కృతిని - మన్నించు జాతి తెలుగు || తేటతేట ||
6. సకలకళల కాణాచి - జన కరుణా వారాశి
కామితార్థ కల్పవల్లి - ప్రేమరాశి తెలుగుతల్లి || తేటతేట ||
7. నన్నయ తిక్కనాది కవుల - కన్నతల్లి తెలుగుతల్లి
అన్నమయ్య త్యాగయ్యల - కన్నతల్లి తెలుగుతల్లి || తేట తేట ||
8. రుద్రమ్మ చానమ్మల - భద్రమాత తెలుగుతల్లి
రాయల ప్రతాపరుద్రుల - లాలించిన తెలుగుతల్లి || తేటతేట ||
                                          డా.యస్వీ. రాఘవేంద్రరావు,
                                    ఎం.ఎ., బి.ఇ.డి., ఎం.ఫిల్., పిహెచ్.డి.,
                                                  రాజమహేంద్రవరం.