17, జూన్ 2017, శనివారం

పితృదినోత్సవం' సందర్భంగా

'పితృదినోత్సవం' సందర్భంగా
మ. గురువై నేర్పితి 'వోనమాలను' సదా కూర్మిన్
ప్రసాదించుచున్,
గురువై నేర్పితి 'పద్యవిద్య' కవితల్ గూర్పంగ
ధీయుక్తిమై,
గురువున్ జేసితి నన్ను, తండ్రి కొడుకున్
గొల్వుండ నొండౌ బడిన్
అరుదౌ ఘట్టము నిర్వహింపబడెగా నచ్చోట
'స్వర్ణోత్సవాల్.'
ఉ. కొంత వయస్సు వచ్చువరకున్ దగు లాలన
పాలనంబులన్,
కొంత వయస్సు వచ్చువరకున్ తగు శిక్షణ
దండనంబులన్,
కొంత వయస్సు మీర దగు కూరిమి నేస్తపు
వర్తనంబులన్
సంతును పెంచగా వలయు జంపతులంచు
నెరింగి సాకరే ?
ఉ. బాగుగ రేల మీకు కనుపట్టకపోవుట నే
పఠించితిన్
భాగవతమ్ము, రామకథ, భారత ముఖ్య
ప్రబంధరాజముల్
ఆ గతి సాగినట్టి కవితాంబ సమర్చన
నన్ను సాకెరా !
నా గురువైతి వీవపుడు, నా గురువైతివి
'పద్య విద్యకున్.'
'పద్యకవితిలక'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి