"నివ్వాళి"
తే. విరిపరిమళ మాస్వాదించు విధమున, మక
రందమును జుర్రినట్లు, మాకందఫలము
నారగించు పగిది, తృప్తి నందజేసి
హాయిగొల్పు కదోయి నీ 'గేయకవిత'.
క. పలికిన పలుకగు గేయము,
ఎలకోయిల తీయని పలుకే యనిపించున్,
జలధర గర్జనము పగిది
నలరించును నీదు వాక్కు లనుపమ రీతిన్.
ఉ. కోకిలమాలపించు తనకోమలగీతివసంతమందె,యీ
కోకిల విందుసేయు తనకోమలగీతుల నిత్యచైత్రమై,
ఆ కృషికుండు కాలవశుడై వ్యవసాయముసేయ,
చేయడే
యీ కవికర్షకాగ్రణి యథేఛ్ఛనిరంతరపద్యసేద్యమున్.
తే. నవ్య చైతన్యమూర్తివి నవకవులకు,
భవ్యదీప్తివి వైదుష్య భావుకులకు,
'నవ్వని పువు' గాంచిన యో "సి.నా.రె!" నాడు
విశదమయ్యె "విశ్వంభర" విశ్వమూర్తి.
సీ. ముంగురు లసియాడు మురిపాల వదనుడై
చూపరు లోగొను రూపి యెవడు ?
తెనుగుదనం బది తేటపడునటుల
దర్శనీయాంబరధారి యెవడు ?
చిరునవ్వు వెన్నెల చిందించు మోముతో
నెదుటి వ్యక్తిని పల్కరించు నెవడు ?
తెలుగు వెలుంగులు దేశ విదేశాల
ప్రసరింపజేసిన ప్రముఖు డెవడు ?
తే. "జ్ఞానపీఠ పురస్కృతి" సత్కృతుండు
నిత్యనూతన చైతన్యనిరతు డతడు,
"పద్మభూషణుం" ఆచార్య ప్రతిథ సుకవి,
దుఃఖవార్ధిలో తెలుగుల త్రోసి వేసి,
'దివిజ కవివరు గుండియల్ దిగ్గురనగ'
నరిగె "విశ్వంభరుండు" తా 'నమరపురికి'
విశ్వవిఖ్యాతకీర్తి ! కవీంద్రమూర్తి !
వైభవోజ్జ్వలదీప్తి ! "నివ్వాళు"లయ్య !
"పద్యకవితిలక"
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు
9299659262
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి