ఉ. ఎప్పటినుండియో రగులు నీ కనిపించని యూక తోడిదౌ
నిప్పుల కొల్మి యారదిక నిక్కముగా, తెలగాణ కాంక్షతో
గుప్పున ప్రజ్వలించును; నిగూధముగా కుములున్, సమైక్యమున్
ఎప్పటికైన కూర్పగలమే ? మనరాష్ట్రము శాంతి బొందునే ?
మ. ఒసగంబోరని ఆంధ్రరాష్ట్ర మిక నెన్నో విన్నపాలిచ్చినన్
అసిధారావ్రతి పొట్టిరాముడు నిరాహారంపు దీక్షావిధిన్
అసువుల్ బాసి తెలుంగు జాతికి సమైక్యాంధ్రిన్ ప్రసాదింప నీ
విసపుంభావపుటగ్నిచే "నమరజీవి" స్వాంత మల్లాడదే ?
మ. "పదవుల్, రాజ్యము భోజ్యమౌ గద ! సదా ప్రత్యేక రాష్ట్రంబునన్"
ఇది యా నేతల బోధనంబు; తగ స్పందింపంగ విద్యార్థికిన్
చదువుల్ పూజ్యము,, సమ్మెలే నిరత, మాశాపాశబంధీకృతుల్
విధిగా వచ్చును రాష్ట్రమంచు నెఱపున్ విద్యార్థులాత్మాహుతుల్.
ఉ. కోరిరి రాష్ట్రభాగమును కొందరు,కొదరు దాని కొప్పమిన్
భారత సంగరంబె జరుపంగలమంచు సవాలు చేయరే ?
కౌరవులెవ్వరో ? రణముఖంబున పాండవు లెవ్వరోగదా !
తీరునొ కోరికల్ ? తుదకు దేవుడెఱుంగును రాష్ట్రయోగమున్.
తే.గీ. అన్నదమ్ముల యైకమత్యంబు సన్న
గిలిన పరులదృష్టిని కడు చులుకనయగు
తెలుగు తల్లిని మూడు ముక్కలుగ జీల్చి
గర్భశోకము గలిగింప గడ్గువారె ?
సీ. భాషాప్రయుక్తమౌ పద్ధతిన్ విభజించి
రక్తిమై నొసగిన రాష్ట్ర మిద్ది,
పార్లమెంటుకు సింహభాగము సభ్యుల
రాజసముగ బంపు రాష్ట్ర మిద్ది,
కేంద్ర ప్రభుత్వాన కీలకపాత్రను
రహిని పోషించిన రాష్ట్ర మిద్ది,
భారత దేశంపు ప్రథమ పౌరులయిన
రాష్ట్రపతుల గన్న రాష్ట్ర మిద్ది,
తే.గీ. ఇన్ని భంగుల మన్నన కెక్కియున్న
కన్నతల్లి మిన్నగు ఘనకల్పవల్లి,
తెలుగుతల్లి, యమృతవల్లి, దివ్యధాత్రి
చిన్న చిన్న ముక్కలయిన చిన్న బోదె ?
డా.యస్వీ. రాఘవేంద్రరావు,
( ఆంధ్ర పద్య కవితసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"ఆంధ్రరాష్ట్రము"పై నిర్వహించిన పద్యకవిసమ్మేళనంలో గానం చేసినవి.)
please visit www.cpbrown.org to know more details about contest on PADYA, GEYA, NAATAKA rachanala poteelu
రిప్లయితొలగించండి