తే.గీ. జగతి తల్లు లిద్దఱు సర్వ జనుల కరయ
నెమ్మి జన్మ నొసగి సాకు "నమ్మ" యొకతె,
యాపద గడవగ శుభము నభయ మొసగి
యల యదృశ్యగతిని గాచు "నంబ" యొకతె.
సీ. హరి హర బ్రహ్మ సూర్య శశి మున్నగువారి
శక్తి గ్రహించుటన్ "శక్తి" వైతి,
"చక్షురు కాలాది" సప్త సేనానుల
జంపి క్రోధంబున "చండి" వైతి,
"శుంభ నిశుంభుల" దంభ మడచి చంపి
"కౌశికి నామంబు గాంచి తీవు,
"చండ ముండులను" గాంచగ మోము కాలమై
"కాళిక" నామంబు గాంచితీవు,
తే.గీ. "నాగలోకము పొండ"ని నైరృతులకు
దూతగ శివు బనిచి "శివదూతి" వైతి,
విజయగాథ లవెన్నియో వేనవేలు
విదిత సింహవాహన ! నతుల్ విజయదుర్గ !
మ. ధర సృష్టిస్థితినాశనంబుల త్రిమూర్తబ్రధ్నరుక్ శక్తివే !
ధరలో నూర్జిత సత్త్వమౌ సకల భూత ప్రాణ సచ్ఛక్తివే !
పరమాశ్చర్యము గూర్చు జీవప్రకృతిన్ వైవిధ్య ధీశక్తివే !
స్మరణీయంబగు నీదు శక్తు లవి సామాన్యంబె శక్త్యంబికా !
శా. కోపోద్దీప్త మహోగ్రరూపమున నా క్రూరున్, జగత్కంటకున్
పాపాత్మున్, వరగర్వితున్, సకలదైవప్రాంశ సంశక్తివై
యేపారన్ రణమందునన్ "మహిషు" మర్దింపన్ త్రిశూలంబునన్
ప్రాపించెన్ జయముల్, ప్రజల్ "విజయదుర్గా !" యంచు గీర్తింపగన్.
ఉ. తామస కామ సంతమస దర్పిత మూర్తులు మత్త చిత్తులౌ
ఆ మహిషాసురాది హతకావళి జంపితి దుర్గ ! శక్తివై;
ఈ మహి నంతకంటెను నికృష్టుల స్వైరవిహారవర్తులన్
ఏమఱి యుంట నీకు తగునే ? దహియింపుము కంటిమంటతోన్.
తే.గీ. "దుష్ట శిక్షణంబు" ధరణి "శిష్ట రక్ష
ణంబు" నవతార లక్ష్య మనంగ వినమె ?
అంబ ! పరమేశ్వరీ ! యిల నవతరించి
"మహి నసురుల" మర్దింపు మాత ! దుర్గ !
యస్వీ. రాఘవేంద్రరావు.
(ఆంధ్ర పద్య కవితాసదస్సు, తూర్పు గోదావరి జిల్లా శాఖ"దేవీ వైభవము"పై నిర్వహించిన పద్యకవిసమ్మేళనము నందు గానము చేసినవి.)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి