3, నవంబర్ 2014, సోమవారం

" దివ్యగీత "

                                        " దివ్యగీత "

ఉ. తెల్లదొరల్ ప్రజాహితమె ధ్యేయ మటంచు దలంచి యేలరే ?
    కొల్లగొనంగలేదె పలుకోటుల దెల్లముగా; స్వదేశులౌ
    నల్లదొరల్ ప్రజా౨హితమె ధ్యేయమటంచు దలంచి యేలుచున్
    కొల్లగొనంగ దాచె పలుకోటుల "నల్లధనంబు"  బ్యాంకులన్.

 ఉ. "కాటను" నిర్మితంబైన కట్టడముల్ బహుకాలముండె, చే
     వాటముతోడ నీతి విడి వారధులన్ రచియింప గూలవే ?
     నేటి స్వతంత్రభారతపు నీతిది, లంచమె రాజ్యమేలు, మో
     మోటములేక కోటులను మూటలుగట్టుట పాటి యయ్యెడిన్.

 గీ.  "మనకు స్వాతంత్ర్యమేతెంచె, మనకు స్వేచ్ఛ
     మనప్రజలు, మనదేశంబు, మనధనంబు
     తినినయంతయు తిని దాచుకొనగవలయు"
     నేతలకిదె నేడిల "దివ్య గీత" యయ్యె.

 మ. పరదాస్యంబున మ్రగ్గుచున్న భరతాంబాశృంఖలాఛేదనన్
      అరదండంబుల, లాఠిదెబ్బలను, కారాగారవాసంబులన్
      అరుసంబొప్పగ స్వీకరించి గత నేత్రాగ్రేసరుల్ గ్రాలరే ?
      తరలింపంగ ప్రజాధనంబు మన నేతల్ దక్షతన్ మీఱరే ?
     
 ఉ.  లంచము "ఫైలు" సాగుటకు, లంచము కార్యము పూర్తియౌటకున్,
      లంచము "జన్మపత్రముల", లంచము పొందగ "చావుపత్రముల్",
      లంచము "దైవవీక్షణకు", లంచము "ధార్మికవైద్యశాలలన్",
      లంచమయంబు సర్వధర, లంచమె లంచమె రాజ్యమేలెడిన్.

  గీ.  "కుంభకోణాల" మాటున కూడబెట్టి
      దోచు సొమ్ము విదేశాల దాచుకొనుచు
      "బ్యాంకు లాకర్లు పట్టక పసిడి దాచ
      పాన్పు, సింహపీఠులజేసి స్వర్ణమయము
      "ఇంద్రవైభవంబు, కుబేరసాంద్రనిధులు
      స్వంత" మని విఱ్ఱవీగెడు స్వార్ఠపరుల
      "భరతము"ను బట్టగా బూనవలయు "యువత".

  గీ.  "లోకపాల్ బిల్లు" చర్చలలో నవగత
      మయ్యె నేతృమనోగత మందఱి కిల,
      వేళ్ళుబారిన "యవినీతివృక్షతతుల"
      సర్వనాశనమ్ము మనకు సాధ్యమగునొ !
(ది. ౨౬.౦౧.౨౦౧౨ తేదీని రాజమహేంద్రవరం ఆదిత్య డిగ్రీకళాశాలలో "స్వతంత్ర
భారతంలో అవినీతి" అనే విషయంపై ఆంధ్రపద్యకవితాసదస్సు తూర్పు గోదావరి
జిల్లా శాఖ ఆధ్వర్యంలో నిర్వహింపబడిన పద్యకవిసమ్మేళనానికి అధ్యక్షత వహించి
గానం చేయబడినవి.)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి