3, మే 2013, శుక్రవారం


              కవితా నీరాజనము
                          ( పుష్కర గోదావరి)

పుష్కరశోభతో వెలయు పుణ్యనదీ ! భవతాపహారిణీ !
దుష్కృతముల్ మహాఘములు దూరము సేతువు మూడు మున్కలన్,
నిష్కృతి గల్గ జేయుదువు నిష్థుర పాపులకున్ కృపారసా
విష్కరణంబునన్ ధరను వెల్లువ గొల్పెదు జీవధాత్రిగాన్.

నాసిక్ త్రయంబకాన ప్రభవించిన తల్లి !
      బాసర భారతి పాఠమంది,
భద్రాద్రి రాముని పాదాలు సేవించి
       పట్టిసంబున వీరభద్రు గొలిచి,
అభిషేకమొనరించి యా కోటిలింగాల
        రాజమహేంద్రికి ప్రాణమిచ్చి,
కని ఉమాసహిత మార్కండేయ శివుని
         గౌతమముని కూర్మి కన్యవైతి,
సప్త గోదావరంబవై గుప్త గతిని
దర్శనంబంది భీమేశు దక్షవాటి,
కోటిఫలి యందు సోమేశు కోరి కొలిచి,
విభుని గూడితి బ్రహ్మ సంవేద్య మందు.

ఇంతకు ముందు చూడిమొదవేమొ యనన్ మెలమెల్ల సాగితే
అంతటలోనె శక్తిగని యమ్మ పయస్సులనాని చెంగునన్
గంతులువేయు లేగవలె గౌతమి ! వేగముతోడ నేగవే?
అంతరమెన్న సూర్య వరుణాదుల తేజము పొందుటంజుమీ !

అదిగొ ! భద్రాద్రి, గౌతమి యిదిగొ! యనుచు
భక్తి పారవశ్యంబున పాడి పాడి
రామ, భద్రాద్రి, గౌతమీ రాగ బంధ
మిలను "రామదాసు" మిగుల వెలయజేసె.

యుగయుగాల చరిత యుల్లమందున నిల్పి
తరతరాల ప్రజల తన్పు తల్లి !
విశ్వ జనులకెల్ల విజ్ఞాన ఖనివమ్మ !
అమ్మ గౌతమి !కొను మంజ లిదిగొ!

ధరణి కొసగుచు తరగని సిరుల పంట
స్వాదు జలముల ప్రాణుల సేదదేర్చు
జీవనాధార ! గౌతమీ ! పావనాంబ !
అమ్మ ! గోదావరీ మాత ! ఆరతిదిగొ !

డా .యస్వీ రాఘవేంద్ర రావు 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి