4, ఆగస్టు 2013, ఆదివారం

కరుణశ్రీ

                                                                                                             డా. యస్వీ.రాఘవేంద్రరావు   

28, జులై 2013, ఆదివారం

ఆచార్య "సి .నా .రె"

                                                ఆచార్య "సి .నా .రె"గారి కి జన్మదిన శుభాకాంక్షలు 

10, జులై 2013, బుధవారం

"నటవిద్యాధర" డా. పీసపాటి

 "నటవిద్యాధర" డా. పీసపాటి  

హృద్యంబౌనె పఠింప రాగ కవితాహీనంబుగా పద్యముల్
ఆద్యంతంబు సరాగ డోలికల నోలార్చుంగదా నీదియౌ
పద్యం బో నరసింహమూర్తి ! మధు శశ్వత్పూర్ణకంఠా ! కళా
వేద్యా ! మాన్య "కళాప్రపూర్ణ నటనావిజ్ఞాన పారంగతా !

తగుమాత్రపు రాగంబున
నిగమోచ్చారణ విధాన నిస్తుల నటనన్
తగుహావభావముల నీ
పగిదిన్ పద్యము పఠించు భావుకుడేడీ !

ఏడీ నీవలె హాయిగ
పాడంగల గాయకుండు పండితవర్యా !
చూడగ నా శ్రీకృష్ణుడె
నే డీ ధర నవతరించె నీ రూపమునన్.

నటనంబును తపమంచు నెంచి ధృత నానానవ్యయోగంబులన్
పటు దీక్షన్ పలు హావభావములు నైపథ్యంబు శోధించుచున్
నటనాంభోనిధి పార మందితివి విన్నాణంబు సాధించుచున్
"నటవిద్యాధర !" కొల్లగొంటి వఖిలాంధ్ర ప్రేక్షక స్వాంతముల్.

"బెల్లపుకొండ" తీపియు, మీసపు సొగసు
      మదిగోరె నిను ప్రేమ మాననీయ !
"బందా" కనకపు శోభయు, గానమాధురి
      ప్రీతిగూడె నిను సంగీతరాయ !
"యడవల్లి" వారి యాయత సౌకుమార్యంబు
      పట్టువడె నమేయ భాగధేయ !
"మాధవపెద్ది" సమ్మానార్హమౌ ఠీవి
      పూర్ణంబుగా నబ్బె బుధవిధేయ !
"చతురభినయధురీణ !" సచ్చరిత ! "ఆంధ్ర
పద్యకవితా సదస్సు" సద్భక్తితోడ
చందురున కొక్క నూల్ప్రోగు సరణి సలుపు
సత్కృతిం గైకొనుము "నటచక్రవర్తి !"
డా .యస్వీ  రాఘవేంద్ర రావు .

(ది. ౧౮.౧౦.౧౯౯౩ తేదీని "చింతామణి" నాటకముపైఆంధ్ర  పద్యకవితా సదస్సు నిర్వహించిన సదస్సులొ ముఖ్య అతిథిగాపాల్గొన్న డా.పీసపాటి నరసింహమూర్తిగారికి జరిగిన సమ్మానసభలోగానము చేసినవి.) 

5, జూన్ 2013, బుధవారం

కాలుష్యపు కోఱలలో

               

క.  కాలుష్యపు కోరఱలలో
     బేలగ జిక్కి విలవిల తపించు ధరిత్రిన్
     ఏలా పట్టించుకొనవు ?
     కాలుని కౌగిలికి నీవు కాతరపడవే ?

ఉ.  ఆలము తప్పు నాయుధము లంతములై ధరకంచు నెంచు ని
      క్కాలము, భూనభోంతరము కల్మషమున్ బొనరించి మృత్యువన్          
      గాలమునందు జిక్కి లయకాలమహోధ్ధుర దండధారితో
      మేలములాడు మానవుడ ! మిక్కిలి వెఱ్ఱివిగావె చూడగన్.

ఉ.   స్వార్థముతోడ మానవుడ ! పబ్బములన్ గడుపంగ జూచి, నీ
      వార్థిక లాభముల్ గొని జనావళి స్వాస్థ్యములన్ పణంబుగా
      వ్యర్థపదార్థముల్ విడచి పావనగౌతమి గర్భకోశమున్
      తీర్థము కల్మషంబుగ విధించెదు వ్యాధినిరూఢలోకమున్         

మ.  పోలముల్ బీడుగ మారి పండకునికిన్ భోజ్యంబు పూజ్యంబుగాన్
      జలలేశంబులు, కాల్వలున్, చెఱువులున్, సంపూర్ణ కాలుష్యమై
      జలముల్ కూడును లేమిచేత బ్రతుకున్ సాగింప యత్నించు కొ
      య్యలు రైతన్నలు; హేతుభూతములు కర్మాగార కాలుష్యముల్.

తే.   చండమార్తాండరోచి:ప్రచండ బహుళ
      నీలలోహిత కిరణముల్ నింగి బర్వి
      హాని గలిగింపకుండగా ప్రాణికోటి
      సహజరక్షణ కవచంబు సాకుచుండు.

శా.  తేజోమూర్తి ప్రభాకరాంశువుల యుద్దీప్తుల్  ప్రబాధింపకన్
      "ఓజోనన్" పొర కాచుచుండ ధర, నీవో ! ఆపొరన్ తూట్లుగాన్
       బేజారెత్త జనుల్, విషానిలములన్ బ్రేరేచి పంపించుచున్
       భూజీవాతు సమగ్రవాయుపరిధిన్ పోకార్చి క్రీడింతువా !

మ.  "జరదాకిళ్ళి" బిగించి నోట, "రజనీ స్టైల్" తో సిగార్ కాల్చుదాం
       సరదాగా" నని నేస్తగాండ్రు పలుకన్ "సై" యంచు "స్మోకింగుకున్"
       సరదా బానిస యౌచు నీ యువత కష్టాలే వరించుంగదే !
       పరదా కప్పుచు తల్లిదండ్రులకు, నాహ్వానించు రోగంబులన్.

ఉ.   కానల కాల్చివేసి తన కాష్ఠము తానుగ వేల్చుచుండె  నీ
      మానవు డెంత వెఱ్ఱి ? పొగమానడు, గుప్పున ప్రక్కవానిపై
      మానక "రింగు" లూదుచు ప్రమాదభరంబుగ జేయుచుండె నీ
      మానవజీవనంబకట ! మానిసి ఎంతటి స్వార్థజీవియో !

ఉ.  ధారుణి నాడు నాటికిని తాపము నొందుచు దుర్భరంబుగా
      "నారని కుంపటై" కుములు నాపక నీవు త్యజించు "కర్బనో
      ద్గారపువేడి "చే హిమనదాలు కరంగుచు వైపరీత్యముల్
      దారుణము "సునాములు" ప్రతాపము చూపు "తుపాను" "లుప్పెనల్."

ఉ.   మోటరు వాహనంబుల "నమూల్యము" జేయుచు జీవితంబులన్
       నాటికి నాటి కాయువును నష్టము చేయుచునుంటి మానవా !
       కాటికి కాలు చాచుకొని కాలుని పిల్చుట చోద్యమయ్య ! నీ
       కేటికి బుద్ది రాదు ? ధర నేగతి రక్షణ నేడు సేయుదో ?

తే.    ఇట్లు భూమి, జలము, వాయు వెంతొ  కలుషి
        తం బగుచు పంచభూతాత్మకంబునైన
        "ధరణి పర్యావరణ" మయ్యె దారుణముగ
        "జీవనాధార" దీని రక్షించు  కొనుము !

క.     కలక యనెడు విషసర్పపు
        బలదారుణదంష్ట్రలందు బడి నలగుచు, కా
        టుల నొందుచు, గుందుచు భీ
        తిలు భూమాతకు "ప్రశాంతి" తేవలెనయ్యా !

డా.యస్వీ రాఘవేంద్ర రావు

31, మే 2013, శుక్రవారం

"వేంగీమహాజాని" రాజరాజనరేంద్రుడు

             
విమలాదిత్య తనూజ !రాజిత మహావేంగీ మహాజాని !పం
చమవేదప్రథితాంధ్రభారత మహా సత్కావ్యకర్త్రాశ్రయా !
హిమవజ్జావర నిత్యపూజన తపస్వీ ! రాజరాజాహ్వయా !
అమృతాకార !చళుక్యరాజ !కొనుమయ్యా ! సన్నుతుల్, హారతుల్.

పంచమవేదమై పరగు భారతమున్ నన్నపార్యుడన్
ప్రాంచిత సత్కవీశకృషికాగ్రణి నీ యభిలాష మెరకున్
గాంచడె తెల్గునేలతొలికావ్యపు పంటను, రాజరాజ ! కా
మించుయశోలతాంగి నిను, మించెడు దక్షపురీశ్వరాదృతిన్.

ఘనమణిదీప్తి కంకణము, కంకణదీప్తిని రత్న మెవ్విధిన్
మనునొ విశేషశోభగని; మానితకీర్తిని నన్నపార్యుడున్
గనె నటు నీదు ప్రాపుగని; కాంచితి వీవు చిరప్రశస్తి నా
తని కృతి భారతంబుగొని, దక్కె యశోనిధి రాణ్మహేంద్రికిన్
దనరెడు గంధభూరుహపుతావులు భూమికి నబ్బునట్లుగన్.

రాజమహేంద్రి ధన్య, కవిరాజ ! మిముంగని; ధన్యుదయ్యె నా
రాజనరేంద్రు డాశశివిరాజిత కీర్తిసమార్జనంబునన్
తేజమునొంది రాంధ్రులు త్వదీయ కృతిన్; గయికొమ్ము భక్తి నీ
రాజనముల్ బుధావళినిరంతర మర్చనసేయు నిమ్ములన్

డా.యస్వీ రాఘవేంద్ర రావు .

24, మే 2013, శుక్రవారం

నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !


         

మ. తలపైనన్ బెనుజుట్టు , దేవనది, రుద్రాక్షల్, విబూదిన్ మెయిన్
      గళసీమన్ గరళంబు, మేనను భుజంగంబుల్, త్రిశూలాయుధా !
      మొల యందున్ గజచర్మమున్, డమరువున్, పుఱ్ఱెల్, గణంబుల్, సదా
      యల సామేన సతిన్  భరింతువు మహేశా ! నన్ భరింపంగదే ?

కం.   గట్టుల రాయని యనుగుం
       బట్టిని రహి జెట్టవట్టి వరలుదువయ్యా
       గట్టింట, గట్టువిలుతుడ !
       గట్టెక్కింపంగ నీలకంధర  రారా !

మ.   లయకాలుండవు, నుబ్బులింగడవు, కాలాంతంబునన్ లోకమున్
       లయమొందింతువు భీకరాకృతిని; బోళాశంకరా ! నిన్ చిదా
       లయమందెవ్వరు  కొల్తురో పశుపతీ ! లాలింతు వారిన్ సదా
       దయపాలించుచు; నీవిలాసము లవేద్యంబుల్ గదే ఈశ్వరా !

ఉ.     వెన్నుడు, బ్రహ్మయున్ కరము విజ్ఞత గోల్పడి యిర్వురున్ సుసం
        పన్ననిరూఢ హంకృతుల స్పర్ధను వచ్చిన, లింగరూపివై              
        పన్నిక వారి గర్వమును బాపి, యసత్యము పల్కు బ్రహ్మకున్
        గ్రన్నన శాపమిచ్సితివి కానగ శక్యమె ? నీ  మహత్వముల్ ?


 సీ.   శిరసుపై గంగమ్మ చిందులు వేయుట
            నిత్యాభిషేకమ్ము నీలకంఠ !
        ఒడలిపైని విభూతి యొప్పారుచుండుట
            సంతత స్నానమ్ము సాంబమూర్తి !
        నాగహారచయమ్ము నర్తించు చుండుట
             విరచితాభరణమ్ము విశ్వనాథ !
        బాల శశాంకుండు ప్రభలీనుచుండుట
              జ్యోత్స్నలు నిరతమ్ము వ్యోమకేశ !
 తే.గీ. ఆచలకన్యా మనోహరార్ధాంగ మహిత !
        ఏనుగుందోలుదాల్ప ! యో కృత్తివాస !
        శంకరా ! యనవరత శ్మశానవాస  ! 
        ఈశ్వరా ! నీదు  లీలల నెఱుగవశమె ?
                                                    డా.యస్వీ. రాఘవేంద్రరావు

19, మే 2013, ఆదివారం

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

కొమ్మల కొమ్మవై, అనదగుమ్మల బాముల బాప నమ్మవై,
పిమ్మట రాజ్యలక్ష్మివయి, పేదల పాలిటి భాగ్యలక్ష్మివై,
సమ్మదమంద గూర్చితివి జంటల పెండిలి పేరటాలివై,
యెమ్మెయి తీఱు నీదు ఋణ మిమ్మహి ? తీఱదు జన్మజన్మలన్.

"కన్నప్రేమ" కన్నమిన్న "పెంచిన ప్రేమ"
యన్న సూక్తి నిక్క మయ్యెనమ్మ !
మీకు సంతు లేమి లోకుల భాగ్యమ్ము
జాలి పంట పండె జంట యెదల.

మూగవోయిన వీణలు మ్రోగ గల్గె,
వాడిపోయిన కుసుమాలు వాసి గాంచె
ప్రాజ్య కారుణ్య వారాశి ! "రాజ్యలక్ష్మి !"
ధన్య మానవతామూర్తి ! మాన్య కీర్తి !

దిక్కు మొక్కును లేక దీన స్థితిని గుందు
సారసాక్షుల ప్రీతి సాకు నేర్పు,
ముక్కుపచ్చారని మురిపాలు నేరని
బాల వితంతుల నేలు నేర్పు,
గాజుల పూవుల మోజు తీరని ముగ్ధ
తరుణాబ్జముఖుల నోదార్చు నేర్పు,
"వంటయింటికె", "చంటిపాపలకే యింతి,
చదువేల ?" యనువారి నెదురు నేర్పు,

తల్లి ! నీ కివి జన్మజాత సుగుణంబు
లట్టి నీచేత మగడు విఖ్యాతి మెఱసె
భర్తృభావానుకూలశుంభత్ప్రవృత్తి !
"రమ్యగుణలక్ష్మి ! శ్రీమతిరాజ్యలక్ష్మి !

                               డా.యస్వీ రాఘవేంద్ర రావు .

3, మే 2013, శుక్రవారం


              కవితా నీరాజనము
                          ( పుష్కర గోదావరి)

పుష్కరశోభతో వెలయు పుణ్యనదీ ! భవతాపహారిణీ !
దుష్కృతముల్ మహాఘములు దూరము సేతువు మూడు మున్కలన్,
నిష్కృతి గల్గ జేయుదువు నిష్థుర పాపులకున్ కృపారసా
విష్కరణంబునన్ ధరను వెల్లువ గొల్పెదు జీవధాత్రిగాన్.

నాసిక్ త్రయంబకాన ప్రభవించిన తల్లి !
      బాసర భారతి పాఠమంది,
భద్రాద్రి రాముని పాదాలు సేవించి
       పట్టిసంబున వీరభద్రు గొలిచి,
అభిషేకమొనరించి యా కోటిలింగాల
        రాజమహేంద్రికి ప్రాణమిచ్చి,
కని ఉమాసహిత మార్కండేయ శివుని
         గౌతమముని కూర్మి కన్యవైతి,
సప్త గోదావరంబవై గుప్త గతిని
దర్శనంబంది భీమేశు దక్షవాటి,
కోటిఫలి యందు సోమేశు కోరి కొలిచి,
విభుని గూడితి బ్రహ్మ సంవేద్య మందు.

ఇంతకు ముందు చూడిమొదవేమొ యనన్ మెలమెల్ల సాగితే
అంతటలోనె శక్తిగని యమ్మ పయస్సులనాని చెంగునన్
గంతులువేయు లేగవలె గౌతమి ! వేగముతోడ నేగవే?
అంతరమెన్న సూర్య వరుణాదుల తేజము పొందుటంజుమీ !

అదిగొ ! భద్రాద్రి, గౌతమి యిదిగొ! యనుచు
భక్తి పారవశ్యంబున పాడి పాడి
రామ, భద్రాద్రి, గౌతమీ రాగ బంధ
మిలను "రామదాసు" మిగుల వెలయజేసె.

యుగయుగాల చరిత యుల్లమందున నిల్పి
తరతరాల ప్రజల తన్పు తల్లి !
విశ్వ జనులకెల్ల విజ్ఞాన ఖనివమ్మ !
అమ్మ గౌతమి !కొను మంజ లిదిగొ!

ధరణి కొసగుచు తరగని సిరుల పంట
స్వాదు జలముల ప్రాణుల సేదదేర్చు
జీవనాధార ! గౌతమీ ! పావనాంబ !
అమ్మ ! గోదావరీ మాత ! ఆరతిదిగొ !

డా .యస్వీ రాఘవేంద్ర రావు 

27, ఏప్రిల్ 2013, శనివారం

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి.


           రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

జీవనాధార పుణ్యగోదావరీ 
దీ మతల్లిక యొడిలోన తృప్తి తీర
అమృత తుల్య సుస్వాదు పయస్సు లాని
రాణకెక్కితివి మహాంధ్రి రాణ్మహేంద్రి !

ఆంధ్ర వాణీబాల కక్షరాల్ నేర్పిన
       "యాచార్య నన్నయ్య " కమ్మ వీవు,
ఆంధ్ర ప్రభుత్వంపు టాస్థాన కవియైన
      ఖ్యాతుదౌ "శ్రీపాద" మాత వీవు,
లలిత హాస్య రసమ్ము నొలికించు "చిలకమ
      ర్తి"ని గన్న యుత్తమ జనని వీవు,
ఖండాంతర ఖ్యాతిగను కళాకారుదౌ
       "దామెర్ల" కున్ కన్న తల్లి వీవు,
ఆదికావ్య సృష్టి కాధారభూతుదౌ
"రాజరాజ" విభుని రాణి వీవు,
సకల కళలనిధివి, సద్గుణాల పృథివి !
రమ్యగుణ మహాంధ్రి ! రాణ్మహేంద్రి !

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్య కర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు,పూజ్యకవి, యా యుగ పూరుషు కంటి వమ్మరో !

ఉరముం జూపి తుపకి గుండులకు, రౌద్రోదేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వర ధైర్యంబను మంత్రముం గొనిన శశ్వత్కీర్తియౌ "నాంధ్రకే
సరి"కిన్ మాతవు రాణ్మహేంద్రి ! కొనుమా సమ్మన భవ్యాంజలిన్.

"భమిడిపాటి" , "మద్దూరి", "న్యాపతి", "రఘుపతి",
"బ్రహ్మజ్యోస్యుల", యల "దేరాజు", "నేదు
నూరి" ముఖ్యులు నీదు కుమారులమ్మ !
మఱల గత వైభవమ్ముల వఱలుమమ్మ !

ప్రాజ్యవైభవ నిధులు, వాణిజ్యపరులు,
దానకర్ణులు, కవితా కళానిరతులు,
నీదుగారాబు కొమరులై నెగడుచుండ
చిరతర యశమ్ము గనుము,జేజేలు గొనుము. 
డా .యస్వీ రాఘవేంద్ర రావు .

1, మార్చి 2013, శుక్రవారం

"మనతెలుగు - తెలుగుతల్లి"


         "మనతెలుగు - తెలుగుతల్లి"
                             (గేయం)

 పల్లవి.  తేట తేట మాటలకు - ఆటపట్టు మన తెలుగు
           తీయని జాతీయాల - తేనెపట్టు మన తెలుగు || తేట  తేట ||

   చ. 1.  మల్లె విరితావి వోలె - ఉల్ల మలరించు తెలుగు
            మలయమారుతము వోలె - పులకింత గూర్చు తెలుగు || తేట తేట ||

        2.  ఆపాత మధురంబై - హర్ష మొందించు తెలుగు
             ఆలోచనామృతమై - ఆనంద మందించు తెలుగు || తేటతేట ||

        3.  మృణాళ నాళము పగిది - మృదులంబైనది తెలుగు
             తేనెసోనల పురుడించు - తియ్యందనాల తెలుగు || తేటతేట ||

        4.   అవధానకళ కెంతో- అద్దము పట్టిన తెలుగు
              కర్ణపర్వ పద్యమును - కన్నతల్లి మనతెలుగు || తేటతేట ||

        5.   అతిథుల నభ్యాగతుల - నాదరించు జాతి తెలుగు
              మహిత పూర్వ సంస్కృతిని - మన్నించు జాతి తెలుగు || తేటతేట ||
            
        6.   సకలకళల కాణాచి - జన కరుణా వారాశి
              కామితార్థ కల్పవల్లి - ప్రేమరాశి తెలుగుతల్లి || తేటతేట ||     
       
        7.   నన్నయ తిక్కనాది కవుల - కన్నతల్లి తెలుగుతల్లి     
              అన్నమయ్య త్యాగయ్యల - కన్నతల్లి తెలుగుతల్లి || తేట తేట ||

        8.   రుద్రమ్మ చానమ్మల - భద్రమాత తెలుగుతల్లి
              రాయల ప్రతాపరుద్రుల - లాలించిన తెలుగుతల్లి || తేటతేట ||

                                                  డా.యస్వీ. రాఘవేంద్రరావు,
                                                        ఎం.ఎ.బి.ఇ.డి.ఎం.ఫిల్.పిహెచ్.డి.,
                                                          రాజమహేంద్రవరం.
(ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా నిర్వహింపబడిన   గేయాల పోటీ కోసం రచించబడినది )