29, ఆగస్టు 2017, మంగళవారం

మాతృభాషను సేవించి మనగదయ్య !

మాతృభాషా దినోత్సవం సందర్భముగా
మాతృభాషను సేవించి మనగదయ్య !
మ. తులలేనట్టిది మాతృభాష, జననీతుల్యంబు, వెన్నంటి ని
న్నిలలో గాచును, పాండితిన్ మనుచు నిన్నెంతేని సంపూర్ణతన్,
సులభగ్రాహ్యము బొధనాధ్యయనముల్ సూ ! మాతృభాషావిధిన్,
అల "ప్రాచీనత" గాంచి తెల్గు, ధర గణ్యంబౌచు వెల్గొందదే ?
గీ. సంస్కృతి పరిరక్షకము భాషామతల్లి,
జాతికిన్ జీవగఱ్ఱ భాషా’మతల్లి,
"నాదు భాష, నాదేశము, నాదు ప్రజలు"
ననెడు నభిమానము గలిగి మనగవలయు.
సీ. "అక్షరరమ్యత" నలరించుచున్ మించు
మానసోల్లాసిని మాతృభాష,
"నాటకీయత గల్గి తేటయై యొప్పెడు
జాతీయదృశ్యంబు మాతృభాష,
"జిగిబిగి యల్లికన్" జిలిబిలి మాటలన్
మంజులంబైనది మాతృభాష,
"ముద్దుపల్కుల"తోడ మురిపంబు లొల్కుచు
మకరందముప్పొంగు మాతృభాష,
పరవశింపజేయు "పదగుంభనంబు"తో
"దేశభాషలందు తెలుగు లెస్స"
అనెడి కీర్తిగన్న యమృతధారాస్యంది
మాననీయము మన మాతృభాష.
గీ. కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాలమూటయు, మల్లెతోట,
తేటిపాట, నెమలియాట, తేనెయూట,
జగతిని తెలుగుమాటకు సాటిరావు.
గీ. చలువవెన్నెలయు, జిలుగువలువ, చెలియ
కులుకు, కలువచెలువమును, చిలుకపలుకు,
మలయపవనంబు, సెలయేటి కలరుతంబు,
తులయగునె యిలను తెలుగు పలుకుబడికి ?
మ. పరిరక్షించెను పూర్వసంస్కృతి కళాపారమ్యరమ్యాకృతిన్,
వరలెన్ నీత్యుపదేశవాఙ్మధురసస్వాదుత్వసంపన్నమై,
తరుణీసమ్మితకావ్యసౌరభలసత్సంతుష్టదిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాల పద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే.
సీ. ఆపాతమధురమై యానందమందించు
దివ్యవాక్సతి మనతెలుగుభాష,
ఆలోచనామృతమై చవులూరించు
తియ్యందనంబుల తెలుగుభాష,
జగతి నజంతభాషగ కీర్తి గడియించు
తేటతేట నుడుల తెలుగుభాష,
సరసాంగి, యనుకూల, సరళయై యొదిగెడు
దేవభాషాపుత్రి తెలుగుభాష,
గీ. "అట్టిభాష నేర్చుకొనుట, యట్టి దేశ
మందు పుట్టుటయును నన్న నల్ప ఫలమె ?
అది తప:ఫలం"బనుట యథార్థమయ్య !
మాతృభాషను సేవించి మనగదయ్య !
డా.యస్వీ. రాఘవేంద్రరావు

24, ఆగస్టు 2017, గురువారం

అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవ సందర్భంగా

అంతర్జాతీయ జానపద విజ్ఞాన దినోత్సవ సందర్భంగా

        "విజ్ఞాన సుపదము జానపదము"

సీ. సంస్కృతి మూలాల సంస్మరింపగజేయు
           'సంప్రదాయపుగని' జానపదము,
    పల్లెవాసుల స్థితి పరికింపగాజేయు
            'సంగీత వాహిని' జానపదము,
    పూర్వనాగరకతన్ పూర్ణంబుగా దెల్పు
             'సాహిత్యవారధి' జానపదము,
     పల్నాటి వీరుల పౌరుషముల దెల్పు
             'సమర చరిత్రము' జానపదము,
తే.  సామెతలు, పొడుపుకథలు, జంగమకథ,
     బుర్రకథ, నాటువైద్యము, పూజనములు,
     చిలకజోస్యము, హాస్యము, కళలు, సోదె
     జనుల 'విజ్ఞాన సుపదము జానపదము'.

            'పద్యకవితిలలక', 'సరసకవి'
           డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

8, ఆగస్టు 2017, మంగళవారం

స్నేహబంధము

"స్నేహబంధము"
స్నేహగంధంబు వాసించు
చిరతరంబు,
స్నేహబంధంబు భాసించు
నిరవధికము,
స్నేహజీవిక దనియించు
నిఖిల జీవి,
స్నేహదీప్తికి జగతి దాసోహ
మనదె?
"పద్యకవితిలక"
డా.యస్వీ.రాఘవేంద్రరావు
రాజమహేంద్రవరం