5, జూన్ 2013, బుధవారం

కాలుష్యపు కోఱలలో

               

క.  కాలుష్యపు కోరఱలలో
     బేలగ జిక్కి విలవిల తపించు ధరిత్రిన్
     ఏలా పట్టించుకొనవు ?
     కాలుని కౌగిలికి నీవు కాతరపడవే ?

ఉ.  ఆలము తప్పు నాయుధము లంతములై ధరకంచు నెంచు ని
      క్కాలము, భూనభోంతరము కల్మషమున్ బొనరించి మృత్యువన్          
      గాలమునందు జిక్కి లయకాలమహోధ్ధుర దండధారితో
      మేలములాడు మానవుడ ! మిక్కిలి వెఱ్ఱివిగావె చూడగన్.

ఉ.   స్వార్థముతోడ మానవుడ ! పబ్బములన్ గడుపంగ జూచి, నీ
      వార్థిక లాభముల్ గొని జనావళి స్వాస్థ్యములన్ పణంబుగా
      వ్యర్థపదార్థముల్ విడచి పావనగౌతమి గర్భకోశమున్
      తీర్థము కల్మషంబుగ విధించెదు వ్యాధినిరూఢలోకమున్         

మ.  పోలముల్ బీడుగ మారి పండకునికిన్ భోజ్యంబు పూజ్యంబుగాన్
      జలలేశంబులు, కాల్వలున్, చెఱువులున్, సంపూర్ణ కాలుష్యమై
      జలముల్ కూడును లేమిచేత బ్రతుకున్ సాగింప యత్నించు కొ
      య్యలు రైతన్నలు; హేతుభూతములు కర్మాగార కాలుష్యముల్.

తే.   చండమార్తాండరోచి:ప్రచండ బహుళ
      నీలలోహిత కిరణముల్ నింగి బర్వి
      హాని గలిగింపకుండగా ప్రాణికోటి
      సహజరక్షణ కవచంబు సాకుచుండు.

శా.  తేజోమూర్తి ప్రభాకరాంశువుల యుద్దీప్తుల్  ప్రబాధింపకన్
      "ఓజోనన్" పొర కాచుచుండ ధర, నీవో ! ఆపొరన్ తూట్లుగాన్
       బేజారెత్త జనుల్, విషానిలములన్ బ్రేరేచి పంపించుచున్
       భూజీవాతు సమగ్రవాయుపరిధిన్ పోకార్చి క్రీడింతువా !

మ.  "జరదాకిళ్ళి" బిగించి నోట, "రజనీ స్టైల్" తో సిగార్ కాల్చుదాం
       సరదాగా" నని నేస్తగాండ్రు పలుకన్ "సై" యంచు "స్మోకింగుకున్"
       సరదా బానిస యౌచు నీ యువత కష్టాలే వరించుంగదే !
       పరదా కప్పుచు తల్లిదండ్రులకు, నాహ్వానించు రోగంబులన్.

ఉ.   కానల కాల్చివేసి తన కాష్ఠము తానుగ వేల్చుచుండె  నీ
      మానవు డెంత వెఱ్ఱి ? పొగమానడు, గుప్పున ప్రక్కవానిపై
      మానక "రింగు" లూదుచు ప్రమాదభరంబుగ జేయుచుండె నీ
      మానవజీవనంబకట ! మానిసి ఎంతటి స్వార్థజీవియో !

ఉ.  ధారుణి నాడు నాటికిని తాపము నొందుచు దుర్భరంబుగా
      "నారని కుంపటై" కుములు నాపక నీవు త్యజించు "కర్బనో
      ద్గారపువేడి "చే హిమనదాలు కరంగుచు వైపరీత్యముల్
      దారుణము "సునాములు" ప్రతాపము చూపు "తుపాను" "లుప్పెనల్."

ఉ.   మోటరు వాహనంబుల "నమూల్యము" జేయుచు జీవితంబులన్
       నాటికి నాటి కాయువును నష్టము చేయుచునుంటి మానవా !
       కాటికి కాలు చాచుకొని కాలుని పిల్చుట చోద్యమయ్య ! నీ
       కేటికి బుద్ది రాదు ? ధర నేగతి రక్షణ నేడు సేయుదో ?

తే.    ఇట్లు భూమి, జలము, వాయు వెంతొ  కలుషి
        తం బగుచు పంచభూతాత్మకంబునైన
        "ధరణి పర్యావరణ" మయ్యె దారుణముగ
        "జీవనాధార" దీని రక్షించు  కొనుము !

క.     కలక యనెడు విషసర్పపు
        బలదారుణదంష్ట్రలందు బడి నలగుచు, కా
        టుల నొందుచు, గుందుచు భీ
        తిలు భూమాతకు "ప్రశాంతి" తేవలెనయ్యా !

డా.యస్వీ రాఘవేంద్ర రావు