4, నవంబర్ 2012, ఆదివారం

అభినందన

                అభినందన
కవితా ప్రక్రియల్లో ' పద్యం ' ఎంత పాతదో అంత లేతది.సంస్కృతభాష లోని వృత్తాలకి,తెలుగు వాడు తన సొంత జాతులను,ఉపజాతులనూ కలుపుకుని,సంస్కృతంలో లేని ప్రాస,వర్ణమైత్రితో కూడిన యతినియమాలు స్వచ్చందం గా విధించుకుని పద్యాన్ని సుసంపన్నం చేసుకున్నాడు.మావి సంస్కృతజన్య భాషలని గొప్పగా చెప్పుకునే ఔత్తరాహ భాషల్లో దేనిలోను ఇవాళ గణబద్ధమైన వృత్తాల్లాంటి పద్యాలు ఉన్నట్లు తోచదు.' పద్యం ' ఒక్క దాక్షిణాత్య భాషల్లోనే మిగిలిపోయింది.అందునా తెలుగులో సర్వలక్షణ లక్షితంగా తెలుగు వాడు గర్వించే సొంత ఆస్తిలా నిలిచిపోయింది.
అలాంటి ' పద్యం ' ఇప్పుడుకొన్ని చారిత్రిక పరిణామాల వల్ల కొంచెం మరుగున పడిపోయింది.
దానికి పూర్వ వైభవం సంతరించడానికి కంకణం కట్టుకున్న,బహుశా ఏకైక,సంస్థ ' ఆంధ్ర పద్య కవితా సదస్సు '.మన సంస్థ ఆవిర్భావం తర్వాతే,చాలమంది వచనకవులు గూడా పద్యకవితా ప్రాశస్త్యాన్ని గుర్తించారు.నిస్సందేహంగా ఆ ఖ్యాతి మన సంస్థదే! ' సాహితీ కౌముది ' సంపాదకుడిగా ఇవాళ ఎంతమంది పద్యకవులం అనిపించుకోడానికి ఉబలాట పడుతున్నారో నాకు తెలుసు.

ఆంధ్ర పద్య కవితాసదస్సు పద్యానికి ఇంత సేవ చేసుకోగలిగిందంటే, అది జిల్లా  శాఖల సహాయ సహకారాలు లేకుండా  సాధ్యమయ్యేదికాదు.సంస్థ ప్రారంభించిన నాటి  నుండీ,విశాఖ,హైదరాబాదు,కరీం నగర్ వంటి కొన్ని శాఖలు చాలా చురుగ్గా పని చేశాయి/చేస్తున్నాయి.

ఇటివల శ్రీ రాఘవేంద్రరావు, శ్రీ  సి.     శర్మ గార్ల సారధ్యంలో తూర్పు గోదావరి జిల్లా శాఖ గూడా ఆ కోవ లో చేరింది. వారు ' నెల నెలా పద్యం '  వంటి కార్యక్రమాల్తో, పద్యానికి విస్తృతంగా ప్రచార ప్రోత్సాహలు ఇస్తున్నారు.విజేతలకు బహుమతులు ఇస్తున్నారు. అంతేగాక,పాఠశాలల్లో తెలుగు భాషాసం రక్షణోద్యమాన్ని ప్రచారం చేస్తూ, విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తున్నారు. 

ప్రతి జిల్లాశాఖా ఇలాగే పనిచేస్తే, ' కవిత్వం ' అంటే 'పద్యం ' అనే రోజు మళ్లీ రావడానికి ఎంతో కాలం పట్టదని నా దృఢ విశ్వాసం.
' నిశాపతి '
(M.H.V.Subbarao) 
ప్రధాన కార్యదర్శి,ఆంధ్రపద్య కవితా సదస్సు హైదరాబాదు.