19, అక్టోబర్ 2017, గురువారం

"ధన్వంతరి జయంతి" మరియు "జాతీయ ఆయుర్వేద దినోత్సవం" సందర్భంగా(17-10-2017)


"ధన్వంతరీ నమోస్తుతే!"
"వైద్యో నారాయణో హరిః"
క్షీరాబ్ధిం బ్రభవించి, మాన్యముగ లక్ష్మీమాత తోబుట్టువై .కారుణ్యం బెసలారు దైవతభిషగ్వర్యుండ!"ధన్వంతరీ!"
ఆ రోగార్త జనాళి కిచ్చితిగదా ఆరోగ్యభాగ్యంబులన్
ఊరార్పంగను వ్యాధిబాధితుల నాయుర్వేద శాస్త్రంబునే.
ఉదితం బయ్యెను వైద్యరంగమున నాయుర్వేద
సంగ్రామమే
ఎదురేలేని మహారుజారుల విదారింపంగ దివ్యౌషధీ
భిదురం బీయరె మానవాళి కిల గంభీరాటవీ సంపదల్
కదనోత్సాహులు, "వైద్య శ్రీహరులు" లోకం బేలు
"నారాయణుల్."
తరచి యోషధీ సాగర తత్త్వగుణము
"శుశ్రుతుండు" రచించెను 'శుశ్రుతంబు'
'చరక సంహిత'ను రచించె "చరకవెజ్జు"
ప్రజల పాలి కల 'హరి నారాయణు' లయి.
ధరణి ప్రాణాంతక వ్యాధితతుల బాపి
మరల నూపిరు లూదుచు 'మానవాళి
మనుగడకు' సేవ సల్పెడు మాన్యులైన
"వైద్యనారాయణహరుల" ప్రస్తుతింతు.
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

2, అక్టోబర్ 2017, సోమవారం


"సాగరకుమార! నీ సేవ సార్థకమ్ము"

ప్రపంచ సాగర దినోత్సవం సందర్భంగా

  "సాగరకుమార! నీ సేవ సార్థకమ్ము"

గంగను నమ్మి, కాచుదువు గండము
                 నుండి జనాళి, ప్రాణపుం
సంగతి లెక్కసేయక రసాతల మేగియు
                 నైన నీటిలో
నంగన సంతు నేమరి, పరాయణమే
                  నిజలక్ష్యమై సదా
నింగికి నర్రు సాచుదువు నిత్తెపు
               బత్తెముకై తపించుచున్.

ధీరత మారుపేరగుచు దిక్కులు 
              కానని యంబరంబు నే
తీరము కానరాని నిజదేశపు సంద్రపు
              మేర మీరకే
పారము లేని మీన సముపార్జన సేసి
               'విదేశముద్ర' కా
ధార నిధానమౌదు, ప్రభుతల్ 
            గురుతించును సేవ, సోదరా!

కడలియలల యూయలపైన కలలు
                               గనెడు
నీ కల తుపాను లుప్పెనల్ నిగ్రహింప,
వలలు, నావలు, గూడును కడలిగలియు,
నీవు నమ్మిన గంగ కన్నీట ముంచ
కంచయే చేను మేసిన కాపు పగిది,
ఎట్లు దిగమ్రింగుకొందు వీ విట్టి వ్యథను?
నేడు విందురు నీదు కన్నీటి కథను,
జాలి గొల్పును నీదు విషాదగాథ,
"సాగరకుమార!" నీసేవ సార్థకమ్ము.

          'పద్యకవితిలక', 'సరసకవి'
      డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

25, సెప్టెంబర్ 2017, సోమవారం

అంజలి !

నదులదినోత్సవం సందర్భంగా
అంజలి !
ఉ. జీవనమై జలంబు నవజీవన మిచ్చును 
ప్రాణికోటికిన్
జీవనమిచ్చు దప్పిగొను జీవుల దాహము
తీర్చుచున్, పున
ర్జీవన మేఘపుష్పమయి సేద్యపుబంటల దన్పు భూతతసం
జీవనియై, భువిన్ సకల జీవుల రక్షణసేయు
తోయమై.
తే. అట్టి జీవనము నొసంగు యమృతతుల్య
మగు పయోధారలను తన యంకమందు
నిల్పి సుతులను తన్పెడు నిర్మలాత్మ
లగు "నదీమతల్లులకు" నే నంజలింతు!
'పద్యకవితిలక', 'సరసకవి'
డాక్టర్ యస్వీ. రాఘవేంద్రరావు

29, ఆగస్టు 2017, మంగళవారం

మాతృభాషను సేవించి మనగదయ్య !

మాతృభాషా దినోత్సవం సందర్భముగా
మాతృభాషను సేవించి మనగదయ్య !
మ. తులలేనట్టిది మాతృభాష, జననీతుల్యంబు, వెన్నంటి ని
న్నిలలో గాచును, పాండితిన్ మనుచు నిన్నెంతేని సంపూర్ణతన్,
సులభగ్రాహ్యము బొధనాధ్యయనముల్ సూ ! మాతృభాషావిధిన్,
అల "ప్రాచీనత" గాంచి తెల్గు, ధర గణ్యంబౌచు వెల్గొందదే ?
గీ. సంస్కృతి పరిరక్షకము భాషామతల్లి,
జాతికిన్ జీవగఱ్ఱ భాషా’మతల్లి,
"నాదు భాష, నాదేశము, నాదు ప్రజలు"
ననెడు నభిమానము గలిగి మనగవలయు.
సీ. "అక్షరరమ్యత" నలరించుచున్ మించు
మానసోల్లాసిని మాతృభాష,
"నాటకీయత గల్గి తేటయై యొప్పెడు
జాతీయదృశ్యంబు మాతృభాష,
"జిగిబిగి యల్లికన్" జిలిబిలి మాటలన్
మంజులంబైనది మాతృభాష,
"ముద్దుపల్కుల"తోడ మురిపంబు లొల్కుచు
మకరందముప్పొంగు మాతృభాష,
పరవశింపజేయు "పదగుంభనంబు"తో
"దేశభాషలందు తెలుగు లెస్స"
అనెడి కీర్తిగన్న యమృతధారాస్యంది
మాననీయము మన మాతృభాష.
గీ. కోకిలమ్మ పాటయు, పసికూన ముద్దు
మాట, ముత్యాలమూటయు, మల్లెతోట,
తేటిపాట, నెమలియాట, తేనెయూట,
జగతిని తెలుగుమాటకు సాటిరావు.
గీ. చలువవెన్నెలయు, జిలుగువలువ, చెలియ
కులుకు, కలువచెలువమును, చిలుకపలుకు,
మలయపవనంబు, సెలయేటి కలరుతంబు,
తులయగునె యిలను తెలుగు పలుకుబడికి ?
మ. పరిరక్షించెను పూర్వసంస్కృతి కళాపారమ్యరమ్యాకృతిన్,
వరలెన్ నీత్యుపదేశవాఙ్మధురసస్వాదుత్వసంపన్నమై,
తరుణీసమ్మితకావ్యసౌరభలసత్సంతుష్టదిక్చక్రమై,
విరిసెన్ వేయిదళాల పద్మమయి యీ వేయేండ్ల సాహిత్యమే.
సీ. ఆపాతమధురమై యానందమందించు
దివ్యవాక్సతి మనతెలుగుభాష,
ఆలోచనామృతమై చవులూరించు
తియ్యందనంబుల తెలుగుభాష,
జగతి నజంతభాషగ కీర్తి గడియించు
తేటతేట నుడుల తెలుగుభాష,
సరసాంగి, యనుకూల, సరళయై యొదిగెడు
దేవభాషాపుత్రి తెలుగుభాష,
గీ. "అట్టిభాష నేర్చుకొనుట, యట్టి దేశ
మందు పుట్టుటయును నన్న నల్ప ఫలమె ?
అది తప:ఫలం"బనుట యథార్థమయ్య !
మాతృభాషను సేవించి మనగదయ్య !
డా.యస్వీ. రాఘవేంద్రరావు