27, అక్టోబర్ 2014, సోమవారం

నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !

   నీ విలాసము లవేద్యంబులుగదే ఈశ్వరా !

మ. తలపైనన్ బెనుజుట్టు , దేవనది, రుద్రాక్షల్, విబూదిన్ మెయిన్
      గళసీమన్ గరళంబు, మేనను భుజంగంబుల్, త్రిశూలాయుధా !
      మొల యందున్ గజచర్మమున్, డమరువున్, పుఱ్ఱెల్, గణంబుల్, సదా
      యల సామేన సతిన్  భరింతువు మహేశా ! నన్ భరింపంగదే ?

కం.   గట్టుల రాయని యనుగుం
       బట్టిని రహి జెట్టవట్టి వరలుదువయ్యా
       గట్టింట, గట్టువిలుతుడ !
       గట్టెక్కింపంగ నీలకంధర  రారా !

మ.   లయకాలుండవు, నుబ్బులింగడవు, కాలాంతంబునన్ లోకమున్
       లయమొందింతువు భీకరాకృతిని; బోళాశంకరా ! నిన్ చిదా
       లయమందెవ్వరు  కొల్తురో పశుపతీ ! లాలింతు వారిన్ సదా
       దయపాలించుచు; నీవిలాసము లవేద్యంబుల్ గదే ఈశ్వరా !

ఉ.     వెన్నుడు, బ్రహ్మయున్ కరము విజ్ఞత గోల్పడి యిర్వురున్ సుసం
        పన్ననిరూఢ హంకృతుల స్పర్ధను వచ్చిన, లింగరూపివై            
        పన్నిక వారి గర్వమును బాపి, యసత్యము పల్కు బ్రహ్మకున్
        గ్రన్నన శాపమిచ్సితివి కానగ శక్యమె ? నీ  మహత్వముల్ ?


 సీ.   శిరసుపై గంగమ్మ చిందులు వేయుట
            నిత్యాభిషేకమ్ము నీలకంఠ !
        ఒడలిపైని విభూతి యొప్పారుచుండుట
            సంతత స్నానమ్ము సాంబమూర్తి !
        నాగహారచయమ్ము నర్తించు చుండుట
             విరచితాభరణమ్ము విశ్వనాథ !
        బాల శశాంకుండు ప్రభలీనుచుండుట
              జ్యోత్స్నలు నిరతమ్ము వ్యోమకేశ !
 తే.గీ. ఆచలకన్యా మనోహరార్ధాంగ మహిత !
        ఏనుగుందోలుదాల్ప ! యో కృత్తివాస !
        శంకరా ! యనవరత శ్మశానవాస  !
        ఈశ్వరా ! నీదు  లీలల నెఱుగవశమె ?
(ఆంధ్రపద్యకవితాసదస్సు "శివలీలల"పై రాజమహేంద్రవరంలో నిర్వహించిన
కవిసమ్మేళనంలో గానంచేసినవి.)
     

                                                    డా.యస్వీ. రాఘవేంద్రరావు,
                                                        ఎం.ఎ., బి.ఇ.డి., ఎం.ఫిల్., పిహెచ్.డి.,
                                                          రాజమహేంద్రవరం.

4, సెప్టెంబర్ 2014, గురువారం

రాధాకృష్ణ జన్మదినము _ ఉపాధ్యాయ సంక్షేమదినము

 
బ్రహ్మవాది ! రాధాకృష్ణ ! భవ్యచరిత !
కొనుము జన్మదినాంజలి కూర్మితోడ
కంటి తత్త్వాంబుధి మధించి కావ్యమణుల
మంటి వత్యాదృతిని మహి మహిత గతిని.

జాతికిన్ జీవగఱ్ఱ లాచార్యులనగ
నట్టి ఉత్కృష్ట వృత్తి జేపట్టి తీవు
సమ్మదదినము మాకు నీ జన్మదినము
శ్రీకరం బుపాధ్యాయ సంక్షేమదినము.

మోదంబందె తెలుంగుజాతి, ప్రజలామోదింప నధ్యక్షుగా
వేదాంతార్థవిశారదా ! సుధ భవద్వేదాంత వక్తృత్వ, మా
హ్లాదంబయ్యె దెలుంగుజాతి ప్రథమాధ్యక్షుండ వీవౌటచే
నాదిన్ నీవు గురుండవౌటను నుపాధ్యాయాళి గర్వించెడిన్.

విశదమైనది నీదు విజ్ఞానధీశక్తి
      యిలలో నుపాధ్యాయవృత్తి కతన
ప్రకటితంబయ్యె నీప్రతిభ మాస్కోనగ
      రమున దౌత్యంబు నెఱపిననాడు
ఉపరాష్ట్రపతిగ, పిదప రాష్ట్రపతిగాగ
      రాణించినది నీదు రాజనీతి,
ఖండఖండాంతర ఖ్యాతి నార్జించిన
      కమనీయ కైవల్య కావ్యకన్య
"భారతీయ తత్త్వము" నీదు భాగ్యదుహిత,
ఆంధ్రకాశికా విశ్వవిద్యాలయముల
తగ నుపాధ్యక్షుడ వయిన ధన్యజీవి !
అందుకోవయ్య ! మా హృదయాంజలులను.
                   డా .యస్వీ రాఘవేంద్ర రావు .

              "అపరధాత" ఉపాధ్యాయుడు

గురువు బ్రహ్మ, తలపంగ గురువు విష్ణు
వనియు, గురు వరయగ మహేశ్వరు డనియును,
పరమ గురువు సక్షాత్పరబ్రహ్మ మనియు
నర్చ సేయరె మున్నుపాధ్యాయవర్య !

నాటి గురుశిష్యులకును నీనాటివారి
కమరియున్నట్టి సంబంధ మరసిచూడ
హస్తి మశకాంతర మన గాదతిశయోక్తి
యట్లు దిగనాడుటకు హేతు వరయవయ్య !

మఱ్ల నొకసారి తాదృశ మహితగతిని
సృష్టి గావింప గలయట్టి స్రష్ట వీవు
ఉద్ధరింపు మట్టి ఘనత నుర్వి ననఘ !
ఇచ్చు తప్పక చేయూత నీశ్వరుండు.

రాజకీయములకు సుదూరముగనుండి
బోధనము నెంచి నీ లక్ష్య సాధనముగ
పౌరులు, ప్రభుత్వమును, సురవరులు మెచ్చ
నందఱికి తలలోనాల్కవగుచు మనుము.

వృత్తులన్నింట మేలైన వృత్తి నీది
జీత బత్తెంపు పెంపుకై చింత వడక
జ్యోతివలె శిష్యులకు తెల్వి ప్రీతి నొసగి
జీవితము గడపుము చిరంజీవి వగుచు.

గాన నాట్య కవిత్వాది కళలయందు
రాజకీయార్థిక ప్రజారంగములను
వైద్య సాంకేతికాదిక విద్యలందు
తీర్చి దిద్దుము బాలుర దివ్యమూర్తి.

శక్తియుక్తుల నన్నింట రక్తి తోడ
జ్ఞానదానంబు సేసి కైంకర్య మెసగ
స్వార్థ చింతను వీడి నిశ్చల ప్రవృత్తి
ధ్యేయ పథమును వీడకు ముపాధ్యాయవర్య !

ధర్మపథమును తప్పని కర్మజీవి !
ఇలను నీ సేవ జనులు గుర్తింపకున్న
బడయుదువు దానఫలితంబు పరమునందు
రిత్తవోవునె నిస్స్వార్థ చిత్తసేవ ?

"గాంధి సత్యపథము" హృదియందు నిల్పి
"నెహ్రు నిర్మాణకుశలత" నింపి మదిని
తలచి పూజ్య "రాధాకృష్ణ దైవనిరతి",
పదిలపఱుచుము బాలుర పసిడి యెదల.
              డా .యస్వీ రాఘవేంద్ర రావు .