30, జనవరి 2013, బుధవారం

బసవన్న విశ్వరూపం


బసవన్న విశ్వరూపం

  • -ముదిగొండ శివప్రసాద్
  •  
  • 27/01/2013
బసవ భావ ప్రభ
వీరశైవ సాహిత్య ప్రసంగములు. వెల: రూ.100/-
ప్రతులకు:
డా.ఎస్.వి.రాఘవేంద్రరావు,
ఎమ్‌ఐజి 59, సుమ శ్రీనివాస్,
ఎపిహెచ్‌బి కాలనీ, లాలా చెరువు, రాజమండ్రి-6)
కర్ణాటక ప్రాంతంలోని హింగుళేశ్వర బాగెవాడిలో వీరశైవ ప్రవక్త బసవేశ్వరుడు జన్మించారు. ఆనాటి కల్యాణ సామ్రాజ్య ప్రభువైన బిజ్జలుని ఆస్థానంలో బసవన్న దండనాయకునిగా ప్రధాన మంత్రిగా ఉద్యోగించారు. శైవం, వీర శైవ ధర్మం అత్యంత ప్రాచీనమైనవి. రేణుకాచార్యుల వలన ఆ యుగంలో వ్యాప్తి చెందింది. వీరి ఆచార్యులు వీరశైవ పీఠాధిపతులు. బసవన్న శైవ లింగాయత ధర్నానికి ఎన్నో సంస్కరణలు చేశారు. ముఖ్యంగా దయలేని ధర్మమేమిటని చాటారు. దేహమే దేవాలయం అన్నారు. స్ర్తి జనోద్ధరణ, అస్పృశ్యతా నివారణ చేశారు. పణ్యాంగనలను పుణ్యాంగనలుగా మార్చారు. ఆర్థిక వికేంద్రీకరణలో అత్యాధునిక సామ్యభావాలను నేటికి ఎనిమిది వందల సంవత్సరాలకు పూర్వమే బసవన్న ప్రవచించారు. పాల్కురికి సోమనాథుడు బసవ పురాణము రచించి బసవేశ్వరుని జీవితాన్ని ప్రపంచానికి మొదటిసారిగా అందించారు.
రాజమహేంద్రవరములో ఇటీవల ఆంధ్ర పద్య కవితా సదస్సు వారి ఆధ్వర్యంలో బసవ సమ్మేళనం జరిగింది. ఆ సందర్భంగా ప్రముఖులు చేసిన ప్రసంగాలు బసవ తత్వము ఒక సంకలన గ్రంథముగా వెలువరించారు. అదే బసవ భావ ప్రభ. ఇందులో ఆయా ప్రముఖులు చేసిన ప్రసంగాల సందర్భంగా అసంఖ్యాక బసవేశ్వర వచనములలో కొన్నింటిని ఉదహరించారు. వాని ద్వారా బసవ తత్వం మనకు అవగతమవుతుంది. గుత్తి చోళదరాశి చంద్రశేఖరరెడ్డి, వారణాసి సుబ్రహ్మణ్యం, లలితాంబిక, ప్రొఫెసర్ శలాక రఘునాధ శర్మ వంటి ప్రముఖులు చేసిన ప్రసంగ వ్యాసాలున్నాయి. అలాగే సుమారు ఎనుబది సంవత్సరాలకు పూర్వం కాకినాడ కేంద్రంగా వీర శైవ ధర్మ ప్రచారం చేసిన బండారు తమ్మయ్య జీవన సాహిత్యాలపై పరిచయ వ్యాసం కూడా ఉంది. సదస్సు నిర్వహించడమే కాక అందలి సారాన్ని శాశ్వతంగా నిలిచేటట్లు గ్రంథ రూపంలో తెచ్చిన నిర్వాహకులు అభినందనీయులు. బసవ తత్వం తెలుసుకోవాలని కోరే సహృదయులకు ఈ చిన్ని గ్రంథం కరదీపికగా ఉపయోగపడుతుంది.
Home
Wednesday January 30, 2013 17:21

 

24, డిసెంబర్ 2012, సోమవారం

ప్రేమను పంచు సోదరా !


ఉ.దేవుని సన్నిధానమున దివ్యపదంబును బొందగోరుచున్ 
   జీవుడు భక్తిమార్గమున చిత్తము తన్మయతన్ భజింపగా
   దేవుని దివ్యపూరుషుగ దిక్కుగ నెంచుచు, తాను ప్రేయసీ
   భావము నొందడే ? పరమభక్తి మథింపగ ప్రేమతత్త్వమౌ

ఉ. గర్భమునందు మోసి, కని, కాచుచు స్వాస్థ్యము కంటిఱెప్పయై,
     దర్భపవిత్రమూర్తియగు తల్లి, యిలాతలా కల్పవల్లి, తా
     నిర్భరమైన వేదనము నిస్తులరీతి సహించి పెంచదే
     యర్భకపాళి వత్సలత, నయ్యది నిర్మల ప్రేమతత్త్వమౌ

మ. పదియార్వేల ముముక్షు తాపస మహాభక్తాగ్రణుల్ బొందరే ? 
      పదియార్వేల వ్రజాంగనామణులుగా వైవాహికాత్మీయతన్
      యదువంశాగ్రణితో, ముముక్షుజన లోకారాధ్యుతో, కృష్ణుతో,
      ఇది శృంగారమె ? దివ్యప్రేమమగుగానీ భక్తిమార్గంబునన్.

మ. మతమేదైననుభక్తిభావమును, సన్మార్గంబు నేర్పున్ సదా,
      అతిభక్తిన్ జనియించు ప్రేమ; పరమాత్మార్థంబు జీవుండు తా
      సతతంబున్ తపియించు; "మాదు మతమే సత్యంబు నిత్యం"బనన్
      హితమే ? అన్యమతంబులన్ దెగడుటల్ హేయంబు లన్యాయముల్.  

మ. విషవృక్షంబగు సంసృతిన్ అమృతమై వెల్గొందు రెండే ఫలాల్,
      రసవత్కావ్యములన్ పఠించి సుధలన్ ద్రావంగ నొండౌ, మరొం
      డసమానంబగు స్నేహమే; అదియె ప్రేమైక్యంబు, ప్రాణప్రదం 
      బు; సదా మిత్రుని క్షేమమున్ వలచు, ఉద్బోధించు సత్కార్యముల్.

తే. మన మతమ్మన్న మన కభిమాన మున్న
     తప్పగునె ? పరద్వేషమ్ము తప్పుగాని;
   "ఈవు జీవించు, పరుల జీవింపనిమ్ము !"
     ఏ మతమ్మైన నిదియె బోధించు మనకు
     నమ్ము! ప్రేమతత్త్వ మిదె నిజమ్ము సుమ్ము !

ఉ. ప్రేమ యొసంగదే మమత, ప్రేమ యొసంగు క్షమాగుణంబునే,
     ప్రేమ యొసంగదే సమత, ప్రేమ యొసంగు దయాగుణంబునే
     ప్రేమ యొసంగు నెయ్యమును, ప్రేమ యడంచును లోని శత్రులన్,
     ప్రేమ విశిష్టదైవతము, పెన్నిధి, ప్రేమను పంచు సోదరా !  
డా. యస్వీ. రాఘవేంద్రరావు

(ఆంధ్ర పద్యకవితాసదస్సు ది.౨౫.౧౨.౨౦౧౧ వ తేదీని నిర్వహించిన "ప్రతినెలా పద్యం" కర్యక్రమంలో నిర్వహింపబడిన "పద్యకవి సమ్మేళనం"
లో అధ్యక్షస్థానం నుండి పఠించినవి.)

ఆద్యంతం ఆకట్టుకున్న అష్టావధానం