3, మే 2013, శుక్రవారం


              కవితా నీరాజనము
                          ( పుష్కర గోదావరి)

పుష్కరశోభతో వెలయు పుణ్యనదీ ! భవతాపహారిణీ !
దుష్కృతముల్ మహాఘములు దూరము సేతువు మూడు మున్కలన్,
నిష్కృతి గల్గ జేయుదువు నిష్థుర పాపులకున్ కృపారసా
విష్కరణంబునన్ ధరను వెల్లువ గొల్పెదు జీవధాత్రిగాన్.

నాసిక్ త్రయంబకాన ప్రభవించిన తల్లి !
      బాసర భారతి పాఠమంది,
భద్రాద్రి రాముని పాదాలు సేవించి
       పట్టిసంబున వీరభద్రు గొలిచి,
అభిషేకమొనరించి యా కోటిలింగాల
        రాజమహేంద్రికి ప్రాణమిచ్చి,
కని ఉమాసహిత మార్కండేయ శివుని
         గౌతమముని కూర్మి కన్యవైతి,
సప్త గోదావరంబవై గుప్త గతిని
దర్శనంబంది భీమేశు దక్షవాటి,
కోటిఫలి యందు సోమేశు కోరి కొలిచి,
విభుని గూడితి బ్రహ్మ సంవేద్య మందు.

ఇంతకు ముందు చూడిమొదవేమొ యనన్ మెలమెల్ల సాగితే
అంతటలోనె శక్తిగని యమ్మ పయస్సులనాని చెంగునన్
గంతులువేయు లేగవలె గౌతమి ! వేగముతోడ నేగవే?
అంతరమెన్న సూర్య వరుణాదుల తేజము పొందుటంజుమీ !

అదిగొ ! భద్రాద్రి, గౌతమి యిదిగొ! యనుచు
భక్తి పారవశ్యంబున పాడి పాడి
రామ, భద్రాద్రి, గౌతమీ రాగ బంధ
మిలను "రామదాసు" మిగుల వెలయజేసె.

యుగయుగాల చరిత యుల్లమందున నిల్పి
తరతరాల ప్రజల తన్పు తల్లి !
విశ్వ జనులకెల్ల విజ్ఞాన ఖనివమ్మ !
అమ్మ గౌతమి !కొను మంజ లిదిగొ!

ధరణి కొసగుచు తరగని సిరుల పంట
స్వాదు జలముల ప్రాణుల సేదదేర్చు
జీవనాధార ! గౌతమీ ! పావనాంబ !
అమ్మ ! గోదావరీ మాత ! ఆరతిదిగొ !

డా .యస్వీ రాఘవేంద్ర రావు 

27, ఏప్రిల్ 2013, శనివారం

రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి.


           రమ్యగుణ మహాంధ్రి రాణ్మహేంద్రి

జీవనాధార పుణ్యగోదావరీ 
దీ మతల్లిక యొడిలోన తృప్తి తీర
అమృత తుల్య సుస్వాదు పయస్సు లాని
రాణకెక్కితివి మహాంధ్రి రాణ్మహేంద్రి !

ఆంధ్ర వాణీబాల కక్షరాల్ నేర్పిన
       "యాచార్య నన్నయ్య " కమ్మ వీవు,
ఆంధ్ర ప్రభుత్వంపు టాస్థాన కవియైన
      ఖ్యాతుదౌ "శ్రీపాద" మాత వీవు,
లలిత హాస్య రసమ్ము నొలికించు "చిలకమ
      ర్తి"ని గన్న యుత్తమ జనని వీవు,
ఖండాంతర ఖ్యాతిగను కళాకారుదౌ
       "దామెర్ల" కున్ కన్న తల్లి వీవు,
ఆదికావ్య సృష్టి కాధారభూతుదౌ
"రాజరాజ" విభుని రాణి వీవు,
సకల కళలనిధివి, సద్గుణాల పృథివి !
రమ్యగుణ మహాంధ్రి ! రాణ్మహేంద్రి !

ఏ మహనీయు డీవి వెలయించి సమున్నత విద్య నిల్పెనో,
ఏ మహనీయు డాత్మ నలరించు శతాధిక కావ్య కర్తయో,
ఏ మహనీయు ధీపటిమ నింతుల వంతలు దూరమయ్యెనో,
ఆ మహనీయు,పూజ్యకవి, యా యుగ పూరుషు కంటి వమ్మరో !

ఉరముం జూపి తుపకి గుండులకు, రౌద్రోదేక దాక్షిణ్య సం
భరితాత్మన్ "సయిమన్ కమీష" నను పెన్బామున్ నిరోధింపగా
వర ధైర్యంబను మంత్రముం గొనిన శశ్వత్కీర్తియౌ "నాంధ్రకే
సరి"కిన్ మాతవు రాణ్మహేంద్రి ! కొనుమా సమ్మన భవ్యాంజలిన్.

"భమిడిపాటి" , "మద్దూరి", "న్యాపతి", "రఘుపతి",
"బ్రహ్మజ్యోస్యుల", యల "దేరాజు", "నేదు
నూరి" ముఖ్యులు నీదు కుమారులమ్మ !
మఱల గత వైభవమ్ముల వఱలుమమ్మ !

ప్రాజ్యవైభవ నిధులు, వాణిజ్యపరులు,
దానకర్ణులు, కవితా కళానిరతులు,
నీదుగారాబు కొమరులై నెగడుచుండ
చిరతర యశమ్ము గనుము,జేజేలు గొనుము. 
డా .యస్వీ రాఘవేంద్ర రావు .